Russia-Ukraine Crisis: ఉక్రెయిన్- ర‌ష్యా మ‌ధ్య యుద్ధం, పుతిన్‌తో మాట్లాడనున్న భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ విష‌యంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ర‌ష్యా అధ్య‌క్షుడు ఆదేశాలు
Russia-and-Ukrain

New Delhi, February 24: భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాత్రి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించ‌నున్న‌ట్లు స‌మాచారం. ర‌ష్యా ఉక్రెయిన్‌పై బాంబుల‌తో (Russia-Ukraine Crisis) విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ పుతిన్‌తో మాట్లాడ‌టం (PM Narendra Modi Likely To Speak to Russian President) ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. ఇప్పటికే ప్రపంచదేశాలు యుద్ధాన్ని ఆపాలని రష్యాపై ఒత్తిడి తెస్తుండగా.. మధ్యలో ఎవరు కలుగజేసుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని పుతిన్‌ హెచ్చరించారు.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్ర‌క‌టించిన యుద్ధాన్ని ఆపడానికి భార‌త్ జోక్యం చేసుకోవాల‌ని ఉక్రెయిన్ రాయ‌బారి ఇగోర్ పోలిఖా కోరిన కొద్ది గంటల్లోనే ప్ర‌ధాని మోదీ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో సంభాషించ‌నున్నార‌న్న వార్త ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్ర‌క‌టించిన యుద్ధాన్ని ఆప‌డానికి భార‌త ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని ఉక్రెయిన్ రాయ‌బారి ఇగోర్ పోలిఖా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ యుద్ధాన్ని ఆప‌డంలో తాము భార‌త క్రియాశీల మ‌ద్ద‌తు కోసం ఎదురు చూస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ప్ర‌ధాని మోదీ మాట్లాడాల‌ని ఇగోర్ పోలిఖా విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపట్లోనే సైన్యం దాడులకు దిగింది. రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ సైనికులు 40 మంది చనిపోయాగా.. సాధారణ పౌరులు పది మంది వరకు మృతి చెందారు. అయితే, 300 వరకు పౌరులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. రష్యా దాడులను ఎదుర్కొంటూనే.. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బిక్కు బిక్కుమంటున్న భారతీయులు, ఉక్రెయిన్‌లో గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత, వెంట‌నే బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని కోరిన భార‌త రాయ‌బార కార్యాల‌యం

ఇటీవలే ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై స్పందించిన భారత్.. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఉక్రేనియన్‌ విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలపై రష్యా బాంబు, రాకెట్‌ దాడులు చేసింది. రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక.. బతికుంటామో లేదో తెలియక భయాందోళనకు గురవుతున్నారు.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా త‌న దాడిని తీవ్ర‌త‌రం చేసిన నేప‌థ్యంలో బ్రిట‌న్ స్పందించింది. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్ర‌జ‌లంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని తాము ప్రార్థ‌న‌లు చేస్తున్నామ‌ని, తాము ఉక్రెయిన్ వైపే ఉన్నామ‌ని హామీ ఇచ్చారు. మ‌రోవైపు బ్రిట‌న్‌ను సుర‌క్షితంగా ఉంచ‌డానికి ఏదైనా చేస్తామ‌ని, బ్రిట‌న్ ప్ర‌జలు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎక్కడివారు అక్కడే ఉండండి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌కు ఎవరూ రావొద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచించిన ఇండియన్‌ ఎంబసీ

పుతిన్ ఓ నియంత అని, ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డ‌టం ద్వారా ర‌ష్యా క్రూర‌త్వం ప్ర‌పంచాల‌కు తెలిసిపోతోంద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని విరుచుకుప‌డ్డారు. త‌మ‌తో స‌హా ఇత‌ర దేశాలు ర‌ష్యాపై విధించిన ఆర్థిక ఆంక్ష‌ల‌ను తాము అంగీక‌రిస్తామ‌ని, ఇక‌.. ఆయిల్ గ్యాస్ విష‌యంలో ర‌ష్యాపై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించుకోవాల‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశ ర‌క్ష‌ణ కోసం తాము ఎవ్వ‌రికైనా ఆయుధాల‌ను ఇవ్వ‌డానికి రెడీగానే ఉన్నామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తివ్వ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ర‌ష్యా మెరుపుదాడి చేసింద‌ని, నాజీ జ‌ర్మ‌నీ లాగా రష్యా దాడి చేసింద‌ని జెలెన్‌స్కీ అభివ‌ర్ణించారు. ర‌ష్యా ఉక్రెయిన్‌పై దాడుల‌కు దిగ‌డంతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు.