Protesters gathered near Sri Lanka’s Presidential palace compound. (Photo Credit: PTI)

Colombo, July 13: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దారుణస్థాయికి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ (Sri Lanka Declares State of Emergency) విధించింది. అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా మిలిటరీ విమానంలో దేశం విడిచి మాల్దీవులకు (President Gotabaya Rajapaksa Flees to Maldives)పారిపోయారు. ఇది తెలిసిన శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది నిరసనకారులు ర్యాలీగా బయల్దేరారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే మొదట ఆందోళనకారులను పోలీసులు గానీ, సైన్యం గానీ నిలువరించలేదు. కానీ వారీ వారు ప్రధాని నివాసం గేటు వద్దకు చేరుకున్నాక పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే శ్రీలంక ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు.

శ్రీలంక అధ్యక్షుడు పరారీలో భారత్ ప్రమేయం.. వార్తలను కొట్టిపారేసిన భారత హైకమిషన్‌ కార్యాలయం, శ్రీలంక ప్రజలకు భారత్‌ సాయం కొనసాగుతుందని స్పష్టం

అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స.. అదే రోజు దేశం విడిచి పారిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని విక్రమ సింఘే ఇదివరకే ప్రకటించారు. కానీ పరిస్థితులు దిగజారినందున లంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధించారు.