Donald Trump Impeached: డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి రెండోసారి ప్రతినిధుల సభ ఆమోదం, సెనేట్ ఆమోదం పొందటమే తరువాయి! బైడెన్ ప్రమాణస్వీకారం రోజున విధ్వంసాలు? ప్రశాంతంగా ఉండాలని ట్రంప్ పిలుపు
Donald Trump (Photo Credits: US President Trump's Twitter)

Washington, January 14: అమెరికాలోని వాషింగటన్ డీసీలో గత వారం జనవరి 6న దారుణమైన కాపిటల్ హిల్ అల్లర్లను ప్రేరేపించినందుకు యూఎస్ ప్రతినిధుల సభ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. మరో వారం రోజుల్లోనే ట్రంప్ పదవీకాలం ముగియనుండగా, అమెరికన్ చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. బుధవారం ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని డెమొక్రాంట్లు ప్రవేశపెట్టగా, అందుకు ట్రంప్ పార్టీకే చెందిన కొంతమంది రిపబ్లికన్ల నుంచి కూడా మద్ధతు లభించింది. దీంతో 232- 197 ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానం ఆమోదించబడింది.

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధృవీకరిస్తూ జనవరి 6న క్యాపిటల్ భవనంలో యూఎస్ కాంగ్రెస్ సమావేశం అయింది. దీనిని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్ధతుదారులు క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి అల్లర్లకు కారణమయ్యారు. భద్రతాసిబ్బంది మరియు ట్రంప్ మద్ధతుదారులకు జరిగిన ఘర్షణల్లో ఓ పోలీసు అధికారి సహా మొత్తం 5 మంది మరణించారు. ఈ హింస తాత్కాలికంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపును నిలిపివేసింది గానీ, చివరకు బైడెన్ విజయం ధృవీకరణను మాత్రం నిలువరించలేకపోయింది. అయితే హింసాత్మక ఘటనలకు కారణమైన ట్రంప్ తనపై తీవ్రమైన వ్యతిరేకత ముద్రవేసుకోవడమే కాకుండా భవిష్యత్తులోనూ ఇకపై ప్రెసిడెంట్ పోటీలో నిలువకుండా చట్టబద్ధమైన అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు 25వ చట్ట సవరణను అమలు చేయడానికి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మంగళవారం నిరాకరించడంతో సభ అభిశంసన తీర్మానంతో ముందుకు సాగింది. 25వ సవరణ ప్రకారం అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఆ స్థానానికి అనర్హుడని రుజువు అయిన సందర్భంలో వారి స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అడ్మినిస్ట్రేషన్ కు అవకాశం లభిస్తుంది. ఈ సవరణ ప్రకారం, వైస్ ప్రెసిడెంట్ మరియు మెజారిటీ గల ప్రతినిధుల బృందం, అధ్యక్షుడిని తొలగించవచ్చు అయితే అందుకు వైస్ ప్రెసిడెంట్ ఒప్పుకోకపోవడంతో, అభిశంసన తీర్మానం పాస్ చేశారు. ఈ తీర్మానం ఇప్పుడు సెనేట్కు వెళుతుంది, ఇది అధ్యక్షుడిని పదవి నుండి తొలగించడానికి విచారణ మరియు ఓటింగ్ నిర్వహిస్తుంది.

అయితే సెనెట్ మాత్రం యునైటెడ్ స్టేట్స్ యొక్క 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు జనవరి 19 వరకు సెనేట్ వాయిదా పడింది. ఏదేమైనా, ఈ క్రమంలో జనవరి 19 వరకు సెనేట్ సెషన్లో లేనందున ట్రంప్ ఇప్పటికిప్పుడు పదవి నుంచి దిగిపోయే పరిస్థితి లేదు. అందుకే ట్రంప్ తన పదవీకాలానికి ముందే నైతిక బాధ్యత వహిస్తూ దిగిపోవాల్సిందిగా యూఎస్ కాంగ్రెస్ ఆయనకు అల్టిమేటం జారీచేస్తున్నారు. అభిశంసన తీర్మానం తర్వాత యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ 'చట్టం కట్టే గొప్ప ఎవరూ కాదు, వారు అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా' అని వ్యాఖ్యానించారు.

మరోవైపు జనవరి 20న జో బిడెన్ ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సాయుధ హింసకు అవకాశం ఉందని భద్రతా సంస్థలు నివేదించడంతో అందరూ సంయమనం పాటించాలని ట్రంప్ కోరారు. "చట్టాన్ని ఉల్లంఘించే ఎలాంటి హింసాత్మక దాడులు మరియు ఎలాంటి విధ్వంసాలు జరగకూడదు నేను కోరుతున్నాను" అని ట్రంప్ బుధవారం వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.