US, August 16: అమెరికాలోని కాలిఫోర్నియలో ఓ జడ్జి(US Judge) తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. కాలిఫోర్నియాలో దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులు అతని ఇంట్లో 47 గన్స్, 26 వేల బుల్లెట్లను గుర్తించారు.ఆ ఆయుధాలన్నీ అక్రమంగా కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భార్యను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 72 ఏళ్ల జడ్జి జెఫ్రీ ఫెర్గూసన్‌ను అరెస్టు చేశారు. ఆరెంజ్ కౌంటీ కోర్టులో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అరెస్టు చేసిన సమయంలో ఆ జడ్జి బాగా తాగిన మత్తులో ఉన్నట్లు తేలింది.
రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లిన దంపతుల మధ్య ఓ విషయంలో వాగ్వాదం మొదలైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో గన్‌తో పేలుస్తానని భార్యను తన చేయితో సంకేతం చేస్తూ బెదిరించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ ఇద్దరి మధ్య మాటలు ముదిరాయి. అయితే వేలితో బెదిరించడం కాదు, నిజంగా కాల్చాలన్నట్లు భార్య రెచ్చగొట్టింది.
దీంతో ఆ జడ్జి తన కాలికి ఉన్న గన్‌ను తీసి షూట్ చేశాడు. ఆ కాల్పుల్లో 65 ఏళ్ల షెర్లీ చనిపోయింది. 2015 నుంచి కోర్టులో జడ్జిగా చేస్తున్న ఫెర్గూసన్.. తన భార్యను మర్డర్ చేయలేదని కోర్టుకు తెలిపారు. ఎటువంటి ఉద్దేశం లేదని, ప్రమాదవశాత్తూ షూటింగ్ జరిగిందని, ఇది క్రైం కాదని కోర్టుకు చెప్పినట్లు లాయర్ పౌల్ మేయర్ వెల్లడించారు. అయితే మిలియన్ డాలర్ల బాండ్‌పై జడ్జి ఫెర్గూసన్‌కు బెయిల్ మంజూరీ చేసింది కోర్టు