Virgin Galactic Spaceship: అంతరిక్షంలోకి ప్రయాణించాలంటే రూ. 1.86 కోట్లు, వచ్చే ఏడాది ప్రయాణానికి క్యూలో 600 మందికి పైగా ఓత్సాహికులు, నింగిలోకి దూసుకెళ్లి క్షేమంగా భూమి మీదకు తిరిగి వచ్చిన వీఎస్ఎస్ యూనిటీ-22, గగనపు వీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలు
Virgin Galactic's owner, Branson

Washington DC, July 12: వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లి క్షేమంగా భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈ చారిత్రక ఘటనతో అంతరిక్ష పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రతువులో కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ అంతరిక్ష పరిశోధన సంస్థ (Virgin Galactic Spaceship) ఆదివారం పంపించిన మానవసహిత వ్యోమనౌక ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లిన వాణిజ్య ప్రయోగంగా యూనిటీ-22 (Virgin Galactic Spaceship ‘Unity 22’) రికార్డు సృష్టించింది.

మిషన్‌లో ప్రయాణించిన ఆరుగురు వ్యోమగాముల్లో ‘వర్జిన్‌ గ్రూప్‌’ అధిపతి రిచర్డ్‌ బ్రాన్‌సన్‌తో పాటు తెలుగింటి అమ్మాయి శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. ఈ మిషన్‌ సక్సెస్‌తో రాకేష్‌ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత రోదసియానం చేసిన నాలుగో భారత సంతతి వ్యక్తిగా, మూడో భారత సంతతి మహిళగా శిరీష రికార్డు సృష్టించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రయోగం.. వాతావరణ ప్రభావం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది.

న్యూమెక్సికోలో వర్జిన్‌ గెలాక్టిక్‌ నిర్మించిన ‘స్పేస్‌పోర్ట్‌ అమెరికా’ (Virgin Galactic's Space Flight) లాంచింగ్‌ సెంటర్‌ నుంచి మొదలైన ఈ రోదసి యాత్ర.. దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగింది. అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు రాత్రి 9.20 గంటల ప్రాంతంలో (భారత కాలమానం) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. రోదసిలో దాదాపు ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉండి పుడమి అందాలను వీక్షించారు.

ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ

కాగా వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌వేస్, వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన స్పేస్‌షిప్‌ ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’తో కూడిన ట్విన్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు వ్యోమగాములతో బయలు దేరింది. వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’తో కూడిన ట్విన్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది.

భారత్‌లో 5జీ సేవలు, 13 కంపెనీల‌ దరఖాస్తులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చైనా కంపెనీలను 5జీ ట్ర‌య‌ల్స్‌కు దూరంగా ఉంచిన టెలికాం విభాగం

8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్‌ ఇంజన్‌ ప్రజ్వరిల్లింది. బ్రాన్‌సన్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్‌ ఆర్బిటాల్‌ టెస్టుఫ్టైట్‌ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు.

Here's Videos

అనంతరం స్పేస్‌షిప్‌ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్‌సన్‌ ట్వీట్‌ చేశారు. స్పేస్‌ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్‌ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు.17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్‌సన్‌ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్‌ గ్లెన్‌ రోదసి యాత్ర చేశారు..

వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ నిరూపించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సైతం స్పేస్‌ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్‌ షిప్‌లో రోదసి యాత్ర చేపట్టనున్నారు.

బ్రాన్‌సన్‌ వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకున్నారు. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

శిరీషకు ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు

గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.