India-Russia Summit: పుతిన్ పర్యటనలో చర్చకు వచ్చే కీలక అంశాలు ఇవేనా.. నేడు ఇండియాకు రానున్న రష్యా అధ్యక్షుడు, 21వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీతో వ్లాదిమిర్ పుతిన్ భేటీ
PM Narendra Modi and Vladimir Putin. (Photo Credits: ANI)

New Delhi, December 6: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) నేడు ఢిల్లీకి రానున్నారు.ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్‌, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోదీతో (PM Narendra Modi) సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పదికి పైగా ఒప్పందాలు (India-Russia Summit) కుదుర్చుకోనున్నాయి. రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 200 హెలికాప్టర్ల తయారీ అంశంపై కూడా అవగాణ కుదుర్చుకోనున్నాయి. అదే రోజు రాత్రి 9.30 గంటలకు పుతిన్‌ రష్యాకు తిరుగు పయనమవుతారు.

చివరి సారిగా గతంలో 2018 అక్టోబర్‌లో పుతిన్, మోదీ మధ్య చర్చలు (21st India-Russia Annual Summit) జరిగాయి. అయితే ఆ తర్వాత మూడేళ్లలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన, దానికి రష్యా మద్దతు తెలపడంతో అది పాక్‌కు లాభదాయకంగా మారింది. మరోవైపు సరిహద్దులో చైనా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ భౌగోళిక సరిహద్దులో అది వివాదాలను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమస్యలతో ఇండియా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురయింది. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా, చైనాతో చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ అంశాలన్నీ నేడు జరగనున్న ద్వైపాక్షిక బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకోవడానికి పుతిన్‌ జెనీవాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్‌ చేస్తున్న విదేశీ పర్యటన ఇండియాదే. పుతిన్, మోదీ సమావేశానికి ముందు ఇరుదేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు చర్చించుకుంటారు. సాధారణంగా పుతిన్‌ విదేశీ ప్రయాణాలపై ఆసక్తి కనబరచనప్పటికీ ఈ కరోనా సమయంలో ఇండియాకు వస్తున్నారంటే కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేశంలో తగ్గుతున్న కరోనా, కొత్తగా 8306 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 98,416 యాక్టివ్‌ కేసులు

భారత్ రెండు దేశాలతో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు చేతులు కలిపి క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసి దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి విదితమే. ఈ క్వాడ్‌ కూటమిపై రష్యా కొంచెం కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా ఆధిపత్య స్థాపన పోరులో రష్యా, భారత్‌లు చెరోవైపు నిలుస్తున్నాయి.

ఇక ఆయుధాల కొనుగోలులో భారత్‌ ఎప్పుడూ రష్యాపైనే ఆధారపడుతుండగా..ఈ మధ్య అమెరికాను కూడా ఆశ్రయిస్తోంది. నేడు జగరనున్న 21వ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది.