AP Government logo (Photo-Wikimedia Commons)

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది. ‘భోళాశంకర్’ నిర్మాణ సంస్థ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ జులై 30న ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థకు అర్జీ పంపినట్టు వివరించింది.

భోళా శంకర్‌ సినిమా టిక్కెట్‌ ధరల పెంపునకు సంబంధించి వివిధ మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థలు, నిర్మాతలు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు, పత్రాలను జతచేసి ప్రత్యేక టిక్కెట్‌ రేట్లు పొందిన విషయం అందరికీ తెలిసిందే.

గూగుల్ మ్యాప్ రూట్‌లో చిరంజీవి, వినూత్నంగా అభిమానం చాటుకున్న అభిమానులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..

కానీ భోళా శంకర్‌ సినిమా నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ – ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ అడిగిన ముఖ్యమైన పత్రాలేవీ సమర్పించలేదు. కేవలం ఈ కారణంగానే ఆ సినిమా టిక్కెట్‌ ధరల పెంపునకు అనుమతి రాలేదు. అంతేతప్ప ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదు

Here's AP Govt Fact Check News

ఆ డాక్యుమెంట్లు సమర్పించలేదు

హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ పారితోషికాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కలిపి రూ.100 కోట్లు దాటితే ప్రత్యేక రేట్లను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 11, 2022న మెమో జారీ చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను పాటించిన పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలకు ప్రత్యేక రేట్లను వర్తింపజేసింది.

తాము నిర్మించిన భోళా శంకర్‌ సినిమా టిక్కెట్‌ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాణ సంస్థ అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జులై 30, 2023న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ – ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీకి అర్జీ పంపింది. ఈ అర్జీని పరిశీలించిన ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ.. జీవో నంబర్‌ 2 రూపంలో ప్రత్యేక టిక్కెట్‌ రేట్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నియమ నిబంధనలను, అనుసరించాల్సిన పద్ధతిని, సమర్పించాల్సిన సాధారణ పత్రాల జాబితాను, అందుకు సంబంధించిన వివరాలను జతచేస్తూ ఆగస్టు 2, 2023న లేఖద్వారా తెలియజేసింది. కానీ, సంబంధిత పత్రాలను, డాక్యుమెంట్లను ఆ సంస్థ ఇప్పటివరకూ సమర్పించలేదు.

ఆ ధృవీకరణ పత్రాలూ సమర్పించలేదు

నిబంధనల ప్రకారం సెన్సార్‌ అయ్యాక సినిమా నిడివిలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. వైజాగ్‌ పోర్టు సహా, అరకు ప్రాంతాల్లో 25 రోజులపాటు చిత్రీకరణ జరిపామని నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జత చేయాల్సిందిగా కూడా ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ కోరింది. అవి కూడా ఇప్పటివరకూ సమర్పించలేదు.

ఆ పత్రాలూ సమర్పించలేదు

చిత్ర నిర్మాణం పూర్తయిన తరవాత సినిమా విడుదలకు ముందే నిర్మాత లేదా నిర్మాణ సంస్థ సినిమా కోసం చేసిన ఖర్చుపై ఒక అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సర్టిఫై చేయాలి. అలాగే సినిమా నిర్మాణానికి సంబంధించి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ లేదా ట్యాక్స్‌ రిటర్న్స్, అడ్వాన్స్‌ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, వీటిని కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు.

దీంతోపాటు ప్రత్యేక టిక్కెట్‌ ధరలకు సంబంధించిన నిబంధనల ప్రకారం – ఏ వ్యాపార సంస్థ అయినా తన కార్యకలాపాల్లో భాగంగా నిర్వహించే 12 రకాల సాధారణ పత్రాలను జతచేయమని కోరడం జరిగింది. ఇప్పటివరకూ వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవీ కూడా చేరలేదు.వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.