ఇప్పుడిప్పుడే అప్పుల భారం నుంచి బయటపడుతున్న అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వివాదంలో తమకు అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది.
డీవీసీ-రియలన్స్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసుపై కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా డీవీసీ.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోల్‌కత్తా హైకోర్టు సమర్ధించింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక దశాబ్దం క్రితం రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.
అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
ఈ సమయంలో డీవీసీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోర్టును ఆశ్రయించింది. 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ.896 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది. కానీ డీవీసీ దీనిపైన కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కేలా గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది.