Fees in AP Schools & Colleges: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం, పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఈ ఫీజులను నిర్ణయించిన జగన్ సర్కారు
ap-govt-issues-notification-for-implementation-of-english-medium-from-next-year (Photo-Twitter)

Amaravati, August 25: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను (Fees in AP Schools & Colleges) ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు (AP Govt Finalized Fees) వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం జగన్ (CM YS Jagan) హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

ఈ కమిషన్‌ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్‌ జారీచేసినప్పటికీ న్యాయవివాదంతో అది అమలు కాలేదు. వాటిని పరిష్కరించుకుని ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కొద్దిరోజుల కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం మంగళవారం జీవో 53, 54లను విడుదల చేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది.

ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ

ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, స్టూడెంట్‌ వెల్ఫేర్, స్టూడెంట్‌ హెల్త్‌ కేర్, స్టడీ టూర్‌ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది.

ప్రాంతాల వారీగా పాఠశాలల ఫీజుల వివరాలు

పంచాయితీ : ప్రైమరీ స్కూళ్లకు (నర్సరీ టూ 5) రూ.10 వేలు, సెకండరీ (6 నుంచి 10)కు రూ.12000

మునిసిపాలిటీ : ప్రైమరీ స్కూళ్లకు (నర్సరీ టూ 5) రూ.11 వేలు, సెకండరీ (6 నుంచి 10)కు రూ.15000

కార్పోరేషన్ : ప్రైమరీ స్కూళ్లకు (నర్సరీ టూ 5) రూ.12 వేలు, సెకండరీ (6 నుంచి 10)కు రూ.18000

ప్రాంతాలు, గ్రూపుల వారీగా జూనియర్ కాలేజీల ఫీజులు

పంచాయితీ : ఎంపీసీ/బైపీసీ రూ. 15 వేలు, సీఈసీ/హెచ్ఈసీ రూ. 12,000.

మునిసిపాలిటీ : ఎంపీసీ/బైపీసీ రూ. 17,500 , సీఈసీ/హెచ్ఈసీ రూ. 15,000.

కార్పోరేషన్ : ఎంపీసీ/బైపీసీ రూ. 20,000 , సీఈసీ/హెచ్ఈసీ రూ. 18,000.

స్కూళ్లు కాలేజీల్లో హస్టల్ ఫీజుల వివరాలు

పంచాయితీ : రూ. 18,000

మునిసిపాలిటీ : రూ. 20,000

కార్పోరేషన్ : రూ. 24,000

జీవోలో పేర్కొన్న నిబంధనలు

కేపిటేషన్ ఫీజులు వసూలు చేయరాదు, యూనిఫాం అయిదేళ్ళ వరకు మార్చకూడదు

పాఠశాలల్లో జేఈఈ, నీట్ పేరీట అదనపు ఫీజులు వసూలు చేయకూడదు, కాలేజీల్లో అయితే రూ. 20 వేల వరకు మాత్రమే వసూలు చేయాలి

ఆయా కోచింగ్ సెంటర్ల అనుమతికి సంబంధిత విభాగాల అనుమతి తీసుకోవాలి

ఫీజులతో పాటు ఇతరత్రా రికార్డులన్నీ క్రమపద్ధతిలో ఉంచాలి

విద్యార్థులను చేర్చడానికి వచ్చే తల్లిదండ్రులకు ఫీజులకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలి, వారికి రశీదులు ఇవ్వాలి

తమ వద్దే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదు

బోధన, బోధనేతర సిబ్బంది అర్హతలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఇతరత్రా ఖర్చుల రికార్డులను కమిషన్ వెబ్ సైట్లో పొందుపరచాలి.

ఫీజు రూపంలో వసూలు చేసే మొత్తంలో 50శాతం మొత్తాన్ని సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించాలి

15 శాతం నిధులను సంస్థ నిర్వహణ అయిన అద్దె, విద్యుత్ ఛార్జీలు, ఇతర ఖర్చులకు వినియోగించాలి

20 శాతం నిధులను విద్యాసంస్థ అభివృద్ధికి కేటాయించాలి. అదనపు భవనాల నిర్మాణం, పాఠశాల అప్‌గ్రేడేషన్, కాలేజీల్లో అదనపు కోర్సుల ఏర్పాటు తదితరాలకు వెచ్చించాలి.

ఈ ఫీజులు 2021 నుంచి మూడేళ్ల పాటు వర్తిస్తాయి.

ఏదైనా విద్యా సంస్థకు గుర్తింపు కొనసాగని పక్షంలో ఆ సంస్థ ఈ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.