Fees in Telangana Schools: ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ
File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyderabad, August 25: తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు (Fees in Telangana Schools) మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్‌ సందర్భంగా స్కూల్‌ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు.

కరోనా నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ సూచనలు తీసుకున్నామని, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే పాఠశాలలు తెరుస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister sabitha Indra reddy) తెలిపారు. క్లాస్‌లను ఆఫ్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తామని, ఆన్‌లైన్‌లో ఉండవని స్పష్టంచేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు (Telangana private schools) వారి స్కూళ్లను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లను కూడా తెరుస్తున్నామని, విద్యార్థులకు జ్వరం వస్తే కొవిడ్‌ టెస్టులు చేసి తల్లిదండ్రుల వద్దకు పంపుతామని చెప్పారు.

ఈనెల 26వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతిరోజు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, సీడీఎంఏ ఎన్‌ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్‌, జాన్‌వెస్లీ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల కోసం విద్యాసంస్థలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

వచ్చేనెల 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈవోలు, డీపీవో, జడ్పీసీఈవోలు, డీఆర్డీవోలు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 30లోగా పాఠశాలలను శుభ్రంచేసి, శానిటైజ్‌ చేసినట్టు ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చేత సర్టిఫికెట్‌ తీసుకొని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసి, వాటికి మంచినీటి సరఫరా చేసే బాధ్యత కార్పొరేషన్ల మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులదేనని స్పష్టంచేశారు.

ఇందుకు పంచాయతీలు, మున్సిపాలిటీల వద్ద అందుబాటులో ఉన్న నిధులను వాడుకోవాలని సూచించారు. పరిశుభ్రంగా ఉంచడం రెగ్యులర్‌ ప్రాసెస్‌ అని, ఇందులో విఫలమైతే సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి మాస్కులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల గదులను, పరిసరాలను శుభ్రం చేయాలని మున్సిపల్‌శాఖ.. కమిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ ఎన్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ఈనెల 30లోగా పాఠశాలలను శుభ్రం చేసే పనులు పూర్తిచేయాలని చెప్పారు. పాఠశాల లోపల మరుగుదొడ్లను, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, సంప్‌, సింటెక్స్‌ ట్యాంకులను శుభ్రం చేయడం తదితర పనులు చేపట్టాలని సూచించారు.

తరగతి గదికి వెళ్లాలంటే మాస్క్‌ తప్పనిసరని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మాస్కు లేకుంటే గదిలోకి అనుమతించొద్దని స్పష్టంచేసింది. ప్రతి టీచర్‌ తప్పనిసరిగా ఏదో ఒక డోసు వ్యాక్సిన్‌ వేసుకుని ఉండాలని, లేదంటే వారం రోజుల్లో తీసుకోవాలని పేర్కొన్నది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. బోధనా సిబ్బంది, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించేలా విద్యాసంస్థల బాధ్యులు, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసుల నమోదుపై ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖకు సమాచారం అందించాలని పేర్కొన్నది.

పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

ప్రత్యక్ష తరగతుల నేపథ్యంలో పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేశారు.

స్కూళ్లు, హాస్టళ్లు, వంటగదులు, తాగునీరు, రవాణా వ్యవస్థల్లో అన్ని సమయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి మాస్క్‌ తప్పనిసరి.

విద్యార్థిలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించాలి. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలితే విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.

మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు లేని స్కూళ్లకు ఈ నెల 30లోపు ఇప్పించాలి.

తరగతి గది సైజును బట్టి విద్యార్థులు భౌతికదూరం పాటించేలా సీట్లు ఏర్పాటుచేయాలి.

విద్యార్థులందరికీ ఈనెల 30లోగా పాఠ్యపుస్తకాలు అందజేయాలి.