Amaravati, Sep 6: ఆన్‌లైన్ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు (AP High Court) ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు (online intermediate admissions) కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది.
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితో పాటు విద్యార్థులు పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు.
ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, నిర్వహణ విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. గతేడాది పత్రికా ప్రకటన ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొస్తే హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే విధంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని.. నిబంధనలు రూపొందించకుండా ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు.
విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు చెబుతోంది. భౌతిక ప్రవేశాలకు కొవిడ్ అడ్డంకి అయితే ఈనెల 16 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విధానంతో కోరుకున్న కళాశాలలో చదువుకునే హక్కును విద్యార్థులు కోల్పోతున్నారు. బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’’ అని పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు.
కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరీక్ష నిర్వహణ కారణంగా కొవిడ్ సోకి విద్యార్థికి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. కొవిడ్ సమయంలో ప్రవేశాల పేరుతో కళాశాలల చుట్టూ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌ను కోట్టేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇంటర్మీడియెట్‌లో ఆన్‌లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్‌లైన్ ప్రవేశాలు ఉంటాయని, ఇందులో రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీలు రూ.100, మిగతా వర్గాలవా రు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సుల కోసం రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లేదా 18002749868లో సంప్రదించాలని సూచించారు.