ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేషన్ (AP PGCET 2022 Notification) బుధవారం రాత్రి విడుదలైంది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ సూర్య కళావతి ఈ నోటిఫికేషన్‌ను విడుదల (AP PGCET 2022 Notification Released) చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం... విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశం లభించనుంది. దరఖాస్తులకు జులై 20వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు చొప్పున ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా 1,358 ఇంటర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 474 జూనియర్ కాలేజీలున్నాయని, మిగతా 884 కళాశాలల్లో కూడా తరగతులు ఈ ఏడాదే కొత్త విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని బొత్స వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్ధులు ఇంటర్‌లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్వహించనున్నారు.