AP SSC, Inter Exams 2021: విద్యార్ధుల జీవితాలతో ఆటలొద్దు, పాస్‌ అని ఇస్తే విద్యార్థులే నష్టపోతారు, అన్ని జాగ్రత్తలతో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
Representational Image (Photo Credits: PTI)

Amaravati, April 28: టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టమని ఏపీ సీఎం జగన్‌ (AP CM YS Jagan) పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు.

కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని, అది రాష్ట్రాల విచక్షణకు సంబంధించిన విషయం అని కేంద్రం చెప్పిందని సీఎం జగన్ వివరించారు.

పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై (Class 10 Class 12 board exams) విమర్శలు చేస్తున్నారని జగన్ వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో అగ్గిపెట్టాలని చూస్తున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు. పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే.. కానీ విద్యార్థులకే నష్టమని జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్ కు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ు రద్దు, క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం, ఆఫ్‌లైన్‌లో 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ు, ప‌రీక్ష‌ల తేదీల‌ను త‌ర్వాత ప్రకటిస్తామని తెలిపిన ఐసీఎస్ఈ

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పనే అని... కష్టమైనా, నష్టమైనా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నామని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి నష్టపోని రీతిలో పరీక్షల నిర్వహణ ఉంటుందని, ఈ విషయంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.

టీడీపీ విమర్శలు చేస్తోంది: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తాము నిర్ణయిస్తే, విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. టీడీపీ నేతలకు ఏం పని లేక పరీక్షలపై పడ్డారని ఎద్దేవా చేశారు. కరోనా వ్యాప్తి సమయంలోనూ సమర్థవంతంగా క్లాసులు నిర్వహించామని వెల్లడించారు. ఇప్పుడు పరీక్షలను కూడా అంతే సమర్థతతో చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

కరుణ చూపిన కరోనా.. పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నేరుగా సెకండ్ ఇయర్‌కి ప్రమోట్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి పాస్ మార్క్స్, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు

ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక కొవిడ్ అధికారిని నియమిస్తామని మంత్రి సురేశ్ చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా యాప్ ను కూడా తీసుకువచ్చామని వెల్లడించారు. పరీక్ష కేంద్రం, తన సీట్ చూసుకునే విధంగా యాప్ రూపొందించినట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పెట్టే అధికారం ఎవరిచ్చారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే రాష్ట్రంలో నిర్వహిస్తున్నారని.. అలాంటప్పుడు విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. స్కూళ్లు తెరిచి 130 మంది టీచర్ల మృతికి కారణమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. మీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు కరోనా బారినపడ్డారన్నారు. ప్రాణం ఉంటేనే చదువు, ప్రాణం ఉంటేనే భవిష్యత్తు అని పేర్కొన్నారు. తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టి, విధుల నుంచి తొలగించారని విమర్శించారు. మొండి పట్టుదల వీడి టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్ని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశా: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇది. పత్రికాముఖంగా, వ్యక్తిగతంగా సీఎంకు ఎన్ని అభ్యర్థనలు చేసినా పట్టించుకోవడంలేదు. పరీక్షలు రద్దు చేశామనో, వాయిదా వేశామనో చెబుతూ ఎలాంటి ప్రకటన సీఎం కార్యాలయం నుంచి రావడంలేదు. ఏపీ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీరే ఆదేశాలు ఇవ్వండి" అని తన లేఖలో కోరారు.