Amaravati, April 14: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. మున్ముందు కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై (AP 10th & Inter Exams Update) ఆలోచిస్తామని చెప్పారు.
కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. ఇప్పటికయితే యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను (CBSE Board Exams 2021 Update) రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ( Ramesh Pokhriyal Nishank), ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.