తమిళనాడు తీరం, శ్రీలంక తీరం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
మరొక ఉపరితల ద్రోణి.. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సగటున సముద్ర మట్టం వద్ద వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వానలు (Andhra Pradesh Rains) కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాల పరిధిలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు, 311 మంది మృతితో 4,59,191కు చేరిన మొత్తం మరణాల సంఖ్య
కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కేరళలో భారీ వర్షాలు, బలమైన గాలులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు "సన్నద్ధంగా" ఉండాలని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలను (IMD Issues Orange Alerts) జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains to Lash Andhra Pradesh) కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల కారణంగా సోమశిల నిండుకుండలా మారింది. కండలేరు జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. వరుసగా అయిదో పర్యాయం ఈ సంవత్సరంలో రెండవ సారి పూర్తిస్థాయి జలమట్టానికి చేరువైంది. సోమశిల రిజర్వాయర్ పూర్తిస్థాయి జలమట్టం 78 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రానికి 74 టీఎంసీల నీటి మట్టం నమోదైంది. కాగా , రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సోమశిలకు వరద ప్రవాహం ప్రారంభమైంది.
దాదాపు 28, 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా , ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరద జలాలకు తోడు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతుండడం , కండలేరు రిజర్వాయర్ కూడా ప్రస్తుత పూర్తిస్థాయి సామర్ధ్యమైన 57 టీఎంసీల నీటి నిల్వను చేరుకోవడంతో సోమశిల క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నానది దిగువకు 31,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా , కావలి కెనాల్‌కు 600 క్యూసెక్కులను వదులుతున్నారు.
కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల వానలు సాధారణం కంటే ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2022 మార్చి వరకు హిందూ మహా సముద్రంపై లానినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో సముద్ర ఉపరితల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురవడంతోపాటు రేపటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిన్న 109 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.