బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే, తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వాతావరణశాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
భారీ వర్షం కారణంగా చెట్లు కూలతాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రోడ్లు జలమయం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పైన పేర్కొన్న ఐదు జోన్ల పరిధిలో రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
తెలంగాణలో వర్షాల అలర్ట్
ఇక తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశ ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా వెల్పూర్‌లో అత్యధికంగా 40 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
రెడ్ అలర్ట్ : ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి
ఆరెంజ్ అలర్ట్ : నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల
ఎల్లో అలర్ట్ : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి
ఏపీలో వర్షాల అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం మధ్యలో పయనిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడురోజులు కొనసాగుతాయని ఐఎండీ మంగళవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశి్చమ గోదావరి, ఎనీ్టఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఎస్పీఎస్సార్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం భారీవర్షాలు కురిశాయి. ఎనీ్టఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 10.2, విశాఖ రూరల్‌లో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.