
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా (Low pressure area forms in Bay of Bengal) మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారానికి వాయుగుండంగా, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా (intensify into cyclone) మారనుంది.
ఆపై ఉత్తరం వైపుగా దిశ మార్చుకుని తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24న తుపానుగా బలపడనుంది. తుపానుగా మారితే దీన్ని 'సిత్రంగ్' (Cyclone Sitrang) అని పిలవనున్నారు. అయితే, దీని ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై ఉండబోదని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపానుగా మారిన తర్వాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటి 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది.ఈ తుపాను ప్రభావం ఏపీ రాష్ట్రంపై ఉండదని, రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని వివరించింది.
రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, యానాం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నర్సీపట్నం (అనకాపల్లి)లో 4.9 సెంటీమీటర్లు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు)లో 2.8, ముండ్లమూరు (ప్రకాశం)లో 2.8, ఆళ్లగడ్డ (నంద్యాల)లో 2.6, తొండూరు (వైఎస్సార్)లో 2.6, ఆస్పరి (కర్నూలు)లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక రానున్న రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలోని చాలాప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.