Andhra Pradesh Weather: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది తుఫానుగా బలపడుతుందని అంచనా వేసిన విశాఖ వాతావరణ కేంద్రం
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, August 14: ఏపీని రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు (Andhra Pradesh Weather) ముంచెత్తనున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం (Low Pressure In Next 48 Hours) ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు.

ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని ఆ కేంద్రం వివరించింది. రానున్న 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో సహాయక యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. అల్పపీడన ప్రభావంతో 17వ తేదీ వరకు తూర్పు తీరంలో 40 కి.మీ -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ శాఖ

మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. డివిజన్, మండల కేంద్రాల్లో రక్షణ, సహాయక శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు1800 425 3077కి కాల్ చేయాలని సూచించారు.