రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తే. కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన రైళ్ల సేవలు మళ్లీ మొదలవనున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం (Several train services to be restored) గమనార్హం. మిగతావి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల్లో మరికొన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి.
ఈ రైళ్లన్నీ గతంలో తిరిగిన మార్గంలోనే కొత్త నంబర్లతో తిరుగుతాయని రైల్వే పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రకటించారు. రైలు ప్రయాణంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే జీఎం స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాల్సిందేనని అన్నారు.
16 ఎక్స్‌ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు గజానన్ తెలిపారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి స్థానిక స్టేషన్‌లోనే టికెట్లు ఇస్తారని పేర్కొన్నారు. ఇక స్టేషన్లు, రైళ్లలో కోవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైళ్లలో ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కొత్తగా ప్రారంభం కాబోయే రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలే కాక, కర్ణాటక రాయచూరు వరకు తిరుగుతాయని గజానన్ వెల్లడించారు. దీంతో సుమారు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి.
అందుబాటులోకి రానున్న రైళ్లలో కొన్ని ఇవే
* కాజీపేట-సిర్పూరు టౌన్
* వాడి-కాచిగూడ
* డోర్నకల్-కాజీపేట
* కాచిగూడ-మహబూబ్ నగర్
* కాచిగూడ- కరీంనగర్
* సికింద్రాబాద్-కళబురిగి
* కరీంనగర్-పెద్దపల్లి
* విజయవాడ-డోర్నకల్
* విజయవాడ-గూడూరు
* కాకినాడ పోర్ట్-విజయవాడ
* నర్సాపూర్-గుంటూరు
* రాజమండ్రి-విజయవాడ
* విజయవాడ-మచిలీపట్టణం
* రేణిగుంట-గుంతకల్
* వరంగల్-సికింద్రాబాద్
* గుంటూరు-విజయవాడ