తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల పాటు (Telugu States For Next 2-3 Days) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) తెలిపింది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగా ఉన్నది.దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర- దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది.
ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరం పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని తెలిపింది.దీనివల్ల ఈ నెల 6వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉన్నదని వివరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వరంగల్ (Warangal), మహబూబాబాద్ జిల్లాల్లో వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ పట్టణంతోపాటు జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది.
ఇక ఏపీలో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.