ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 30,31 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు (Heavy Rains Forecast For Telugu States) కురుస్తాయి.
సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్.కోటలో 5.0 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains forecast) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు భారీ నుంచి అతి భారీ, రేపు (మంగళవారం) భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రవాప్తంగా వర్షాలు పడ్డాయి. కుమురంభీం జిల్లా సిర్పూరులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.