Chamoli, Feb 8: ఉత్తరాఖండ్ జల విలయం ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 14కు చేరుకున్నది. మొత్తం 170 మంది ఈ ఘటనలో మిస్సయ్యారు. చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడడం వల్ల.. ఆదివారం అలకనంద, దౌలీగంగా నదుల్లో భారీ వరద (Uttarakhand Glacier Disaster) వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఉప్పెనలో (Uttarakhand Glacier) రిషిగంగా, ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జోషీమఠ్ వద్ద ఉన్న తపోవన్ టన్నెల్‌ను ఐటీబీపీ జవాన్లు శుభ్రం చేస్తున్నారు.
టన్నెల్‌లో భారీ స్థాయిలో వరదమట్టి కూరుకుపోయింది. తపోవన్ టన్నెల్ ప్రవేశం వద్ద ఉన్న బురద మట్టిని తొలగించేందుకు ఆర్మీ సిబ్బంది, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ దళాలు కఠోరంగా శ్రమిస్తున్నారు. భారీ జేసీబీలతో టన్నెల్ వద్ద ఉన్న మట్టిని రాత్రంతా తొలగించారు. జనరేటర్లు, సెర్చ్ లైట్లు పెట్టి మరీ పనిచేశారు. సుమారు 80 మీటర్ల దూరం మేర టన్నెల్‌ను క్లీన్ చేసినట్లు ఐటీబీపీ డీఐజీ అపర్ణా కుమార్ తెలిపారు. జేసీబీలతో మట్టిని తొలగిస్తున్నట్లు ఆమె చెప్పారు. సుమారు 180 మీటర్ల పొడుగు ఆ టన్నెల్ ఉన్నట్లు ఆమె చెప్పారు. టన్నెల్ లోపల కనీసం 40 మంది వరకు కార్మికులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఉత్తరాఖండ్ జల విలయం..తపోవన్ డ్యామ్‌ను, జలాశయాన్ని నామరూపాల్లేకుండా చేసింది. ప్రాధమిక సర్వే అనంతరం 520 మెగావాట్ల తపోవన్ విష్ణుగద్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. దీని విలువ దాదాపు రూ. 3 వేల కోట్లని తెలుస్తోంది. మంచు చరియలు విరిగిపడిన నష్టంపై అంచనా వేసేందుకు భారత వాయుసేన ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జలాశయం, డ్యామ్ అసలు కనిపించలేదు. విమానాల్లో సర్వేకు వెళ్లిన అధికారులు, డెహ్రాడూన్ కు 280 కిలోమీటర్ల దూరంలోని ధౌలీ గంగా, రిషి గంగా నదులను పరిశీలించారు. మలరీ తపోవన్ జలాశయం వద్ద నిర్మించిన మలరీ లోయకు వెళ్లే రెండు వంతెనలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.
జోషిమఠ్, తపోవన్ మధ్య ఉన్న రహదారి కూడా నాశనం అయిందని, ఇక్కడి లోయలో ఉన్న జనావాస నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. నందాదేవి పర్వతంపై ఉన్న కొండ చరియలు విరిగి పడటమే ఇంత ప్రమాదానికి కారణమని, ఈ చరియలు పిపిల్ కోటి, చమోలీ నుంచి కిందకు జారి ధౌలీ గంగా, అలకనంద నదులపై పడ్డాయని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ డ్యామ్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న 170 మంది గల్లంతు కాగా, రిషి గంగా నదీ తీరంలో ఉన్న రైనీ గ్రామం పూర్తిగా నాశనమైంది.
ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో చాలా మంది జాడ ఇంకా తెలియరాలేదు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, మంచు పర్వతాల నుంచి చరియలు విరిగి పడిన ఘటన పెను ప్రభావాన్నే చూపిందని డ్యామ్ లో ఓ వైపు పూర్తిగా నాశనమైందని ఎన్టీపీసీ పేర్కొంది. కాగా, ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు రావడం, ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై పర్యావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడి ప్రాజెక్టులను మరోమారు పరిశీలించాలని, పర్వతాలపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశాయి.
తపోవన్ టన్నెల్స్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. టన్నెల్స్‌ను ఉన్న బురదను తొలగించడం కష్టమైన పని అయినప్పటికీ, ఐటీబీపీ జవాన్లు విజవయంతంగా ఆ బురదను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎప్, మిలిటరీ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. నేటి మధ్యాహ్నం వరకు మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అన్నారు.
ఉత్తరాఖండ్‌లో హిమపాతం వల్ల కలిగిన ఆకస్మిక వరద బీభత్సంలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ పరిహారాన్ని ప్రకటించారు. చమోలిలో హిమానీనదం విరగడం వలన సంభవించిన విషాద హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తనకు రెండు సార్లు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారని, అన్ని విధాలుగా సహాయం చేస్తారని హామీ ఇచ్చారని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఈ విషాదంలో మరణించిన వారికి ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ రూ .4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన విషయం విదితమే.