Hyd, Dec 11: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు.
జైపూర్‌లో బంధువుల వివాహానికి హాజరవుతారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్రమంత్రలను విన్నవించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేయనున్నారు.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్. పీసీసీ అధ్యక్షుడి నియామకం మాత్రమే జరుగగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్ష పదవులు సీనియర్లకు దక్కేలా ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు రేవంత్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
అలాగే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు, సీనియారిటి ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 25 మందితో కూడిన జాబితాను సీఎం సిద్ధం చేయగా దీనికి కాంగ్రెస్ అధిష్టానం అమోదముద్ర వేస్తే ప్రకటనే తరువాయి కానుంది. మొత్తంగా ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై క్లారిటీ రానున్న నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.