Covid in India: కరోనాపై ఊరట, 4 లక్షల దిగువకు పడిపోయిన కోవిడ్ యాక్టివ్ కేసులు, దేశంలో తాజాగా 32,981 కేసులు, ఏపీలో 24 గంటల్లో 667 మందికి కరోనా పాజిటివ్
Medical workers (Photo Credits: IANS)

New Delhi, December 7: దేశంలో సెప్టెంబర్‌ తర్వాత మొదటిసారిగా యాక్టివ్‌ కేసులు 4 లక్షల దిగువకు పడిపోయాయి. అదేవిధంగా చాలా రోజుల తర్వాత కరోనా మృతులు నాలుగు వందలకు తక్కువగా నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 32,981 పాజిటివ్‌ కేసులు (Covid in India) నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 8 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,77,203కు (Covid Cases in India) చేరింది. ఇందులో 3,96,729 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 91,39,901 మంది బాధితులు కోలుకున్నారు.

ఇందులో నిన్న 39,109 మంది కరోనా నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 391 మంది కొత్తగా మరణించారు. దీంతో మొత్తం మరణాలు 1,40,573 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందారు. దేశంలో డిసెంబర్‌ 6 వరకు 14,77,87,656 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 8,01,081 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

గుడ్ న్యూస్..కరోనా వ్యాక్సిన్ లైవ్‌లోకి వస్తోంది, ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్, వచ్చే వారం నుంచి అందుబాటులోకి, అమెరికా నుంచే కరోనా వ్యాప్తి అంటూ కొత్త రిపోర్ట్ బయటకు

ఏపీలో తగ్గుముఖం పట్టిన కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 60,329 కరోనా టెస్టులు నిర్వహించగా 667 మందికి కరోనా పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 129 కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 114, చిత్తూరు జిల్లాలో 105 కేసులు గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 18, కడప జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 33, ప్రకాశం జిల్లాలో 36 కేసులు గుర్తించారు.

అదే సమయంలో రాష్ట్రంలో 914 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,71,972 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,59,029 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,910కి దిగొచ్చింది. మొత్తం మరణాల సంఖ్య 7,033కి చేరింది.