Davos, May 22; దావోస్‌లో (Davos) జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో (World Economic forum) పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు. దీనిలో భాగంగా విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా పంప్డ్‌ స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ సెంటర్‌లో ఆయనతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయన్న ప్రొఫెసర్‌ క్లాజ్‌.. ధాన్యాగారంగా పేరొందిన ఏపీని ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహర కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కీలక పాత్ర పోషించగలదన్నారు. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్‌ ష్వాప్‌ ఆహ్వానించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశంపై చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్‌ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు.

CM YS Jagan Review: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష, బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన ఏపీ ముఖ్యమంత్రి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అబ్బురపరిచిన విద్యార్థులు 

సోషల్‌ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం జగన్‌ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతీ ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని తెలిపారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్‌ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైన ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతీ 2వేల జనాభాకు వైఎస్సార్‌ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ, తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు.

ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్‌ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశితంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు.

CM YS Jagan: దేశంలోనే బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం జగన్, వరుసగా రెండో సారి అరుదైన ఘనత సాధించిన ఏపీ ముఖ్యమంత్రి, స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ - 2022గా జగన్  

ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌స్టోరేజీ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని సీఎం వివరించారు. విండ్, సోలార్, హైడల్‌.. ఈమూడింటిని కూడా సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని సీఎం వివరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.

తదుపరి సీఎం జగన్‌... బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం జగన్‌ వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్‌వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ ప్రశంసించారు. నైపుణ్యమానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్‌ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. తర్వాత సీఎం జగన్‌.. అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.