Vjy, Nov 13: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది.
గతంలో జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని అంతే తప్ప పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.