Vjy, Nov 6: మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.
కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.
మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ మండిపడ్డారు.
జనవరిలో మైలవరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ . ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు.