Vjy, Nov 6: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులకు లీగల్ సెల్ అండగా నిలిచింది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షకట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏ కార్యకర్త మీద అక్రమంగా నిర్బంధించినా పార్టీ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందిస్తుందన్నారు. బాధితులు పార్టీ దృష్టికి తీసుకు రావటానికి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని.. అక్రమ కేసులు వేసిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు. పూర్తి న్యాయ సహకారం పార్టీనే అందిస్తుందని.. జైహింద్ అన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తని నందిగామలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చో పెట్టారని.. ఇదేనా ప్రజాస్వామ్యం?. చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’’ అని పొన్నవోలు తెలిపారు.
అరాచకాలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులా: అంబటి రాంబాబు
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు వనమా వజ్రబాబు.. నగరంపాలెం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్, మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్‌ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్ పవన్ కల్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.
మా మహిళా నాయకురాలు విడదల రజినిపై దారుణంగా అసభ్యకరంగా టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోస్టులు పెడితే పోలీసులు ఆనందమా?. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలి. డీజీపీకి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.