YS jagan Mohan Reddy (Photo-YSRCP/X)

Vjy, Dec 11: కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రేషన్‌ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ ఇవాళ తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు?.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి

మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎక్స్ పోర్ట్ లో నెంబర్ వన్ గా ఉన్నారు... ఇటీవల పోర్టులో డిప్యూటీ సీఎం తనిఖీలు చేశారంటున్నారు... కానీ పయ్యావుల వియ్యంకుడు ఎగుమతులు చేస్తున్న ఆ షిప్ ను మాత్రం తనిఖీ చేయలేదు అంటూ జగన్ ఆరోపించారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి.

పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు?. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కనపెట్టాం. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం. సార్టెక్స్‌ చేసిన మరీ ఇచ్చాం. రేషన్‌ బియ్యం దుర్వినియోగాన్ని అడ్డుకుంది మనమే.

కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్‌ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు. దీని వల్ల మళ్లీ రేషన్‌ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.