Nellore, Dec 11: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు.
సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్‌లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.
సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు.
నిన్న సోమిరెడ్డి మాట్లాడుతూ.. విజయసాయిని లోపలేయటానికి పింక్ డైమండ్‌పై చేసిన అసత్యం ఒక్కటి చాలన్నారు. ఒళ్లు కొవ్వెక్కి విజయసాయి ముఖ్యమంత్రిని తిడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు జగన్‌తో అవినీతిలో పోటీపడిన ఏ2 విజయసాయి అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మరి విజయసాయికి ఎందుకు మినహాయింపునిస్తున్నారు? చట్టాలేం చేస్తున్నాయి? ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదు. విజయసాయిరెడ్డి బతుకంతా అరాచకం, దోపిడీనే. అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం అక్రమ రవాణా, భూకబ్జాలు.. అన్నింటిలో ఏ2 నంబర్ 1గా ఉన్నారని విమర్శలు చేశారు. అరాచకాలు, భూకబ్జాలు, రేషన్ బియ్యం ఎగుమతులు అన్నింటిలో ఆయన పాత్ర ఉంది’ అని ధ్వజమెత్తారు.