YS jagan Mohan Reddy (Photo-YSRCP/X)

New Delhi, Dec 10: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూ­ర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు. తనకు కలిగిన పరువు నష్టానికి రూ.వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు.

ఈ దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్, దాని ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్, దాని ఎడిటర్‌ ఎన్‌.రాహుల్‌ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసా­రం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్‌ అనుబంధ పిటిషన్‌లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయ­స్థానం నోటీసులు జారీ చేసింది.

ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు ? ఉచిత రేషన్ ఇవ్వడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్‌ అభ్యర్థనను పరిగణ­నలోకి తీసుకున్న హైకోర్టు, ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తరువాత మీరు ఏ కథ­నాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసీ ప్రచురించినట్లుగానే భావి­స్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమోణియమ్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.