YSR Netanna Nestam Scheme: చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు
YSR Netanna Nestam (Photo-Twitter -YSRCP Digital Media)

Amaravathi, December 21: చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో (dharmavaram) వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. నేడు జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు.

అకౌంట్లలో పడే డబ్బులను బకాయిలు కింద జమ చేసుకోకుండా.. బ్యాంకులకు ఆదేశాలిచ్చామని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లు ఖర్చు పెట్టనుంది. కాగా ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే (Praja Sankalpa Yatra) జగన్‌ ప్రకటించారు.

ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజధాని అంశం, ఎవరి వాదనలు వారివే

ఇప్పటికే జాబితా రెడీ అయింది. అర్హులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్‌ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలు తయారుచేస్తున్నారు.

Here's Tweet

లాంచింగ్ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..

పాదయాత్రలో చేనేతల కష్టాన్ని చూశాను.. బాధను విన్నాను. నేను ఉన్నానని చెప్పి ఆ రోజు అందరికి చెప్పానన్నారు. చెప్పిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో (YSRCP Manifesto 2019)హామీ ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకుంటూ వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపు 85 వేల కుటుంబాలకు ఈ సాయాన్ని విడుదల చేయబోతున్నాం.

చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. సొమ్మును మీరు చేసిన పాత అప్పులకు బ్యాంకు వాళ్లు జమ చేసుకోకుండా వారితో కూడా మాట్లాడటం జరిగిందని సీఎం జగన్‌ అన్నారు. ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా అందిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.

వచ్చే ఉగాది లోగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తామన్నారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15వేలు సాయం అందజేస్తామన్నారు. వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేశామన్నారు. ఐదేళ్లుగా న్యాయం జరగని అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా కల్పించామన్నారు. మత్స్యకారులకు మునుపెన్నడూ లేనివిధంగా సహాయం చేస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.