Amaravathi, December 21: మొన్నటి దాకా ఇసుక వార్ మీద నడిచిన ఏపీ రాజకీయాలు (Andhra pradesh politics) ఇప్పుడు రాజధాని (AP Capital Row) మీదకు తిరిగాయి. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) ఏపీ రాజధానిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనను వికేంద్రీకరిస్తామని ఇందులో భాగంగా ఏపీ రాజధాని మూడు చోట్ల ఉండొచ్చని( AP Three Capital Row) కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎన్ రావు రిపోర్టుపై అందరి కళ్లు పడ్డాయి. ఎట్టకేలకు జీఎన్ రావు కమిటీ అందించిన నివేదిక జగన్ చెంతకు చేరింది.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) సభ్యులు.. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి నిర్ణయం రాలేదు. డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్చిస్తుందని సమాచారం వస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికన్నా ముందుగానే నాయకులు రాజధానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నాయకులు ఏమంటున్నారో ఓ సారి పరిశీలిస్తే..
ప్రతిపక్ష నేత చంద్రబాబు
వైసీపీ పాలకులు అమరావతిని నాశనం చేస్తున్నారని, అవినీతి పేరుతో అమరావతిని చంపేయాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం జగన్ క్షోభకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మూడు కాకపోతే 30 రాజధానులు పెడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. 30 రాజధానులు పెట్టడానికి ఇదేమైనా మీ జాగీరా? అని ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంత్రి మండలి నిర్ణయం కోసం వేచిచూస్తామని చెప్పారు. జనసేన నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం..కానీ అభివృద్ధి అంటే 4 ప్రభుత్వ కార్యాలయాలో లేక 4 భవనాలో కాదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం కావాలన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై పవన్ ఇప్పటికే అభ్యంతరం తెలిపారు.
సినీ నటుడు చిరంజీవి
ఏపీ రాజధానిని మూడు రాజధానులుగా మార్చే ఆలోచనను చిరంజీవి స్వాగతించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతులు తొలగించేలా కమిటీ సిఫార్సులున్నాయని తెలిపారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకో రూ.లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు నివారించేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు.
బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి
జగన్ నిర్ణయాలతో ప్రజలు గందరగోళంలో ఉన్నారని, జీఎన్ రావు కమిటీ కాదు జగన్ కమిటీ అనడం మేలు అని విమర్శలు గుప్పించారు. జీఎన్ రావు కమిటీకి శాస్త్రీయత లేదని విష్ణు చెప్పారు. రాజధాని పై జగన్ నిర్ణయం తీసుకోవడానికి సగం కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీ చేసిన పాపానికి రాజధాని రైతులు బలవుతున్నారని విష్ణువర్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది పొలిటికల్ డ్రామా అని ఆయన అన్నారు.
నగరి ఎమ్మెల్యే రోజా
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రాజ్ భవన్, అసెంబ్లీ, ఎడ్యుకేషన్ హబ్, ఎయిమ్స్ ఉంటుందని అన్నారు. అమరాతికి ఎలాంటి నష్టం జరుగదన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉందని గుర్తు చేశారు. అమరావతిలో ఏదో నష్టమైపోతుందని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీజీ వెంకటేష్
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా కర్నూల్లో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రజాభీష్టాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతిలో సచివాలయం ఏర్పాటు చేయాలని.. విశాఖకు రాజధాని హంగులు ఉన్నట్లే అమరావతి, కర్నూల్లో కూడా ఉండాలని టీజీ అభిప్రాయపడ్డారు. మంత్రులు ఒకచోట, సీఎం ఒకచోట ఉండటం మంచిది కాదన్నారు. ఇదేవిధంగా వ్యవహరిస్తే భవిష్యత్తుల్లో విభజన తప్పదని ఆయన హెచ్చరించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే రద్దు చేశామన్నారు. అసైన్డ్ భూములను రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు. రైతులకు డెవలప్ మెంట్ ప్లాట్లు ఇస్తామని..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతిలో రాజధాని పేరిట సమీకరించిన భూముల్ని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని, ఈ విషయాన్ని తాము ఎన్నికల ప్రణాళికలోనే స్పష్టం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 200 ఎకరాల పరిధిలో ఉండగా.. అమరావతికి 33 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటే అధికార వికేంద్రీకణ జరుగుతుందన్నారు. రాజధానుల ఏర్పాటుపై కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. వారికేం సంబంధమని ప్రశ్నించారు.
ఎంపీ విజయసాయి రెడ్డి
అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నాదే ప్రభుత్వ ఉద్దేశమన్న విజయసాయి రెడ్డి పరిపాలన రాజధానిపై కూడా విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఏ విధంగా ఉంటుందో ఆయన స్పష్టం చేశారు. రానున్న పదేళ్లో మరో బాంబేలా విశాఖ తయారవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
రైతుల నుంచి నిరసన
రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ధర్నా చేపట్టారు. మందడంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. తమ పిల్లల భవిష్య త్ కోసమే గత ప్రభుత్వానికి భూములు ఇచ్చామని రైతులు తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనను జగన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.