Covid Pandemic: కరోనా తగ్గినా డేంజరేనట, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు వంటివి వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు, ఇండియాలో స్పుత్నిక్‌-వి ట్రయల్స్ ప్రారంభం, ఏపీలో తాజాగా 685 మందికి కరోనా
Coronavirus Outbreak. | (Photo-PTI)

Amaravati, Dec 2: ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్‌ కేసులు (Covid Pandemic in AP) నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 51,854 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఈమేరకు ఫలితాలు వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 146, చిత్తూరు 95, గుంటూరు 87, పశ్చిమగోదావరి 77, తూర్పుగోదావరి 70, కడప 30, కర్నూలు 10, విజయనగరం 9, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కాగా, 1,094 మంది తాజాగా కరోనా (Covid Scare) నుంచి కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 8,68,749 మంది కరోనా (Coronavirus) బారినపడగా, 8,54, 326 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

మరో 7,427 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం కరోనాతో నలుగురు మృతి (Covid Daths) చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరిల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6,996కి చేరింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలకు వచ్చిన 120 మందికి పుష్కర ఘాట్‌లలో పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్‌ వచ్చింది.

రష్యా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో మనుషులపై రెండు/మూడో దశల ప్రయోగ పరీక్షలను మంగళవారం ప్రారంభించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కో-చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి.ప్రసాద్‌ వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ నుంచి అనుమతులన్నీ లభించిన వెంటనే వలంటీర్లపై పరీక్షలను ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ట్రయల్స్‌ జరుగుతాయన్నారు.

కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు, దేశంలో తాజాగా 36,604 మందికి కోవిడ్ పాజిటివ్, 1,38,122కి చేరుకున్న మరణాల సంఖ్య

క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం తమకు రిసెర్చ్‌ భాగస్వామిగా జేఎ్‌సఎస్‌ మెడికల్‌ రిసెర్చ్‌ వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌తోనూ జట్టు కట్టామని, తద్వారా వాటికి చెందిన క్లినికల్‌ ట్రయల్‌ కేంద్రాలను వాడుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న కొందరిలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెడుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రధానంగా ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ’ రకానికి చెందిన రుగ్మతలు బయటపడుతున్నాయని తెలిపారు. ఫలితంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు, పల్మనరీ ఎంబాలిజం వంటివి సంభవించి మరణానికీ దారితీయొచ్చని హెచ్చరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ మొదటి దశలో దగ్గు, జ్వరం, శ్వాస సమస్యలు కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్‌ సోకిన రెండు నుంచి ఐదు వారాల తర్వాత.. రెండో దశ కరోనా లక్షణాలు బయటపడుతాయి. హృదయ సంబంధ సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్ల రూపంలో లక్షణాలు బయటపడతాయి. మూడోదశలో.. కరోనా సోకిన 60 రోజుల తర్వాత రోగిలో నీరసం, శ్వాస సమస్య, కీళ్లనొప్పి, ఛాతీనొప్పి వంటి సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో మనం 16 నుంచి 18 నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నామన్నారు. దేశం మొత్తం మీద టీకాలు వేయడం గురించి ప్రభుత్వం ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు.

తమ ఉద్దేశం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలని, దీనిలో విజయవంతమైంతే, అందరికీ టీకాలు వేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా పంజాబ్, రాజస్థాన్, హరియాణాలలో కరోనా మరోమారు విజృంభిస్తున్నదని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కరోనా కట్టడి నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.