Vjy, Oct 29: కాకినాడ జిల్లా తునిలో ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా డ్యాన్స్ వేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు. మంత్రి లోకేశ్ ఆయన సమయస్ఫూర్తిని, డ్యాన్స్‌ను మెచ్చుకోవడంతో అధికారులు ఆయనకు మళ్లీ విధులు కేటాయించారు.
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యంలో కర్రల లోడు ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో బస్సును నిలిపివేశాడు. అదే సమయంలో ఓ యువకుడు వీడియో తీస్తుండడంతో లోవరాజు బస్సు ముందు డ్యాన్స్ చేసి ప్రయాణికులకు వినోదం పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులు అతడికి విధులు కేటాయించకుండా పక్కనపెట్టారు.
APSRTC Driver Dance Video
డాన్స్ సూపర్ బ్రదర్! Keep it up! 👏🏻👌🏻
I hope the bus passengers had as great a time watching the performance as I did, without any complaints! 😜😂 https://t.co/n8X7TSSKty
— Lokesh Nara (@naralokesh) October 26, 2024
తాజాగా, లోవరాజు డ్యాన్స్ వీడియో మంత్రి లోకేశ్ దృష్టిలో పడడంతో ఆయన మెచ్చుకున్నారు. ‘సూపర్‌గా డ్యాన్స్ చేశారు బ్రదర్.. కీపిట్ అప్’ అని ఎక్స్ ద్వారా ప్రశంసించారు. లోకేశ్ ట్వీట్‌కు డాక్ట్ మహిష్మ.కే అనే ఎక్స్ యూజర్ స్పందిస్తూ.. మీరు ట్వీట్ చేయకముందే ఈ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారట అన్నా.. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోండి అని కోరాడు. క్రమశిక్షణ, సమయ పాలన ముఖ్యమే కానీ, హాని చేయని వినోదం నేరం కాదని పేర్కొన్నారు.
అమెరికాలో ఉన్న లోకేశ్ ఈ పోస్టు చూసిన వెంటనే స్పందించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేస్తారని, వెంటనే అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటారని, తాను వచ్చిన వెంటనే వీలు చూసుకుని లోవరాజును కలుస్తానని మరో పోస్టు చేశారు. లోకేశ్ పోస్టుతో లోవరాజును అధికారులు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.