New Delhi, June 6: దేశరాజధాని ఢిల్లీలో 72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే డోర్ స్టెప్ ఆఫ్ రేషన్ స్కీమ్‌ను (Doorstep Ration Delivery Scheme) కేంద్ర ప్రభుత్వం మరోమారు నిలిపివేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై (Arvind Kejriwal Slams Centre) విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారు.
‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన (Arvind Kejriwal) కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఢిల్లీ సీఎం.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి.
కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. రేషన్ ఆప్‌కో లేక భాజపాకో చెందింది కాదు. మోదీ, కేజ్రీవాల్ ఇద్దరూ కలిసి రేషన్ అందిస్తున్నారని ప్రజలు భావిస్తారని తెలిపారు. ఈ పథకాన్ని ఆపేది లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఈ పథకానికి ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజనా అనే పేరు పెట్టారు. ఈ పథకంలో భాగంగా బియ్యం, గోధుమ పిండిని అర్హులైన వారికి ఇంటికి నేరుగా సరఫరా చేస్తామని ఆప్ ప్రభుత్వం తెలిపింది.
కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది.
కేంద్రమే రేషన్ మాఫియా తరపున నిలబడితే, పేదలకు ఎవరు అండగా ఉంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గత 75 సంవత్సరాలుగా దేశ ప్రజలు రేషన్ మాఫియాకు బలవుతున్నారన్నారు. 17 ఏళ్ల క్రితం తాను ఈ రేషన్ మాఫియాకు వ్యతిరేకంగా గొంతు వినిపించానని. ఈ నేపధ్యంలో తనపై ఏడుసార్లు దాడి జరిగిందన్నారు. ఆ సమయంలో తాను ఈ వ్యవస్థను ఏదో ఒక సమయంలో ప్రక్షాళన చేస్తానని ప్రతిజ్ఞ చేశానన్నారు. అందుకే ఇప్పుడు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే ప్రణాళికతో ముందుకు వచ్చామన్నారు. అయితే కేంద్రం తమ ప్రయత్నాలను అడ్డుకుంటోందని ఆరోపించారు.