Atul Subhash (Photo Credits: X/@alashshukla)

Atul Subhash Case: డబ్బుల కోసం భార్య, కుటుంబ సభ్యులు వేధించడంతో బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతుల్ యొక్క 24 పేజీల డెత్ నోట్ మరియు వీడియో సందేశం వైరల్ అయ్యాయి, వేధింపులు, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటున్న పురుషుల దుస్థితిని ఎత్తిచూపారు.

అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు, రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారైన అతని భార్య నికితా సింఘానియా, వీడియో ఇదిగో..

వరకట్న చట్టాల దుర్వినియోగం, దాడి కేసుపై చర్చకు తెరలేచినట్లు ఆయన వీడియోలో పంచుకున్నారు. ‘న్యాయం జరగాలి’ అనే ప్లకార్డును మెడలో వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు తర్వాత, ఇప్పుడు '#MenToo', '#JusticeIsDue' హ్యాష్‌ట్యాగ్‌లు Xలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పురుషులు కూడా వేధింపులకు, తప్పుడు కేసులకు గురవుతున్నారని పురుషుల హక్కుల కార్యకర్త కుమార్ వి జగ్గిర్దార్ అన్నారు. పురుషుల హక్కుల పరిరక్షణకు చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అతుల్ కేసు భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది.

బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు పూర్వాపరాలు..

యూపీకి చెందిన అతుల్ సుభాష్ బెంగుళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగి. ఓ ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నాడు. అతనికి నిఖితా సింఘానియాతో పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె ఉంది. అతుల్ తో గొడవపడి కొంతకాలం క్రితం తన భార్య యూపీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరి వివాదం తీవ్రమైంది.

భార్య, అత్తమామలు వేధిస్తున్నారని టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య, 24-పేజీల సూసైడ్ నోట్‌ రాసి మరీ బలవనర్మరణం

తన అత్త కట్నం కోసం వేధించినట్లు, నా భర్త మద్యం తాగి వచ్చి నన్ను కొట్టేవాడని, నన్ను పశువులా చూసేవాడని, నన్ను బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకునేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం తన భర్తపై తొమ్మిది కేసులు నమోదయ్యాయి. వీటిన్నింటిని చూసిన అతుల్ సుభాష్ తన జీవితాన్ని ముగిస్తూ సూసైడ్ లేఖతో పాటు ఓ వీడియోని వదిలాడు. ఇంకా న్యాయం జరగాల్సి ఉంది'' (జస్టిస్ ఈజ్ డ్యూ) అని ఇంగ్లిష్‌లో రాసి, దాని పక్కనే చనిపోయే ముందు తాను చేయాలనుకున్న పనుల చెక్ లిస్ట్ కప్‌బోర్డుపై అతికించి, వాటిలో అన్ని పనులూ చేసినట్టుగా టిక్ పెట్టి, ఆత్మహత్య చేసుకున్నారు అతుల్.

అతుల్ సుభాష్ సూసైడ్ లేఖలో ఏముంది..

‘‘నాపై వచ్చిన వచ్చిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను నా భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబం నుంచి రూ. 10లక్షల కట్నం డిమాండ్ చేశానట.. నా భార్య ఇంటి నుంచి వెళ్లినప్పుడు నా సంపాదన ఏడాదికి రూ. 40లక్షలు అని, తరువాత ఏడాదికి రూ.80లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. రూ. 80లక్షలు సంపాదించే వ్యక్తి రూ. 10 లక్షలు డిమాండ్ చేసి భార్యాపిల్లలను వదిలేస్తారా’’ అంటూ అతుల్ ప్రశ్నించాడు.ఈ లేఖలో న్యాయస్థానంపైనా తీవ్ర ఆరోపణలు చేశాడు. భరణం ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతడిని అనడం, దానికి న్యాయమూర్తి నవ్వడంతో తీవ్రంగా బాధించిందని తెలిపాడు.

హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసులు వంటి తప్పుడు కేసులు తనపై పెట్టారన్నారు. కేసును మొత్తం 120 సార్లు వాయిదాలు వేశారని, తాను స్వయంగా 40 సార్లు బెంగళూరు నుంచి జాన్పూర్ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తన వృద్ధ తల్లిదండ్రులు బిహార్ నుంచి, తన సోదరుడు ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చిందన్నారు.కేసు సెటిల్మెంటుకు ముందుగా రూ.కోటి, తరువాత రూ.3 కోట్లు డిమాండ్ చేశారని, మూడేళ్లుగా బాబుతో మాట్లాడనివ్వలేదని, బాబు ఖర్చుల కోసం మాత్రం నెలకు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని రాశారు.

తనను వేధించిన వారిని శిక్షించే వరకు తన ఎముకలను దహనం చేయొద్దని అతుల్ లేఖలో డిమాండ్ చేశాడు. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి, నా భార్య, ఇతర వేధింపులు దోషులు కాదని కోర్టు నిర్ణయిస్తే, తన బూడిదను కోర్టు వెలుపల ఒక గాడిలో వేయాలని అతుల్ తెలిపాడు. ఇలా వేధించే వారికి కోర్టు సుదీర్ఘకాలం శిక్షలు వేయాలని, తన భార్య లాంటి వాళ్లను జైలుకు పంపకపోతే ఇలాంటి వాళ్లకు ధైర్యం పెరిగి భవిష్యత్తులో సమాజంలోని ఇతరులపై మరిన్ని తప్పుడు కేసలు పెడతారని అతుల్ తనలేఖలో ప్రస్తావించాడు.

అతుల్ సుభాష్ ఎక్స్ వీడియోలో.. ఈ ఏటీఎం శాశ్వతంగా మూత పడింది. భారత్‌లో మగవారిపై చట్టపరమైన మారణకాండ జరుగుతోంది'' అనే హెడ్డింగ్‌తో గంటా 20 నిమిషాల నిడివి గల వీడియో, తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియో అందరితో కంట తడి పెట్టిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా ‘‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

అతని భార్య నికితా సింఘానియాను ఉద్యోగం నుంచి తొలగించాలని యాక్సెంచర్ కంపెనీకి వేల సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నాయి. వరకట్న వేధింపుల చట్టం, సెక్షన్ 498ఏ దుర్వినియోగం చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక మార్గదర్శకాలను సూచించింది.

ఇక నికితా కుటుంబం అర్ధరాత్రి తమ ఇంటికి తాళాలు వేసి, పరారయ్యీరు.సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూర్ పోలీసులు నికితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై BNS సెక్షన్‌లు 108 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. దీంతో వారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు యూపీ జౌన్‌పూర్ లోని వారి ఇంటి నుంచి పారిపోయారు. నికితా తల్లిదండ్రులు, బావమరిది అనురాగ్ సింఘాయా పారిపోతున్న వీడియో వైరల్ అయింది.

తాజాగా అతుల్ బంధువు ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. నా సోదరుడికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా.. పురుషులకు కూడా ఈ దేశంలోని చట్ట ప్రక్రియ నుంచి న్యాయం అందాలి. న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతి కొనసాగితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది. మెల్లగా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. తాము ఏటీఎం యంత్రాల వలే మారిపోతామనే భావనతో పెళ్లిళ్లు అంటేనే పురుషులు భయపడే పరిస్థితి దారితీస్తుందని వ్యాఖ్యానించాడు.