Patna, May 10: పవిత్రమైన గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూడు, నాలుగు కిలో మీటర్ దూరం వరకు దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు (Covid Dead Bodies In Ganga River) పడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు కప్పిన కరోనా మృతదేహాలు గంగా నది ఒడ్డున పడేశారు. మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో వాటిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, బిహార్‌లోని బక్సార్ జిల్లాలో పారుతున్న గంగానదిలో (Ganga River) కరోనాతో చనిపోయిన మృతదేహాలు (Covid Dead Bodies) పడి ఉన్న సంఘటన దేశ వ్యాప్తంగా కరోనా దుస్థితిని కళ్లకు కడుతోంది. కాగా యూపీలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసే శ్మశానం కూడా నిండి ఉండడం.. కుటుంబసభ్యులు నిరాకరించడం వంటి వాటితో ఇక విధిలేక కొందరు ఆస్పత్రుల నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు గంగానది ఒడ్డున కరోనా మృతదేహాలను పడేశారని తెలుస్తోంది.
దీంతోపాటు బిహార్‌లోని బక్సర్ జిల్లా నగర్ పరిషద్ పట్టణంలో పారుతున్న గంగానదిలోనూ మృతదేహాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కాగా గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీలోని హమీర్‌పూర్ ఏఎస్పీ అనూప్‌కుమార్ స్పందించారు. హమీర్‌పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం.. పూడ్చడం వంటివి చేయరని.. అలా నదిలో పారవేస్తారని ఏఎస్పీ తెలిపారు.
Here's ANI Update
Bihar | 10-12 corpses that were seen in Ganga came floating from a distance. It seems these corpses were floating for the last 5-7 days. We don't have a tradition of immersing bodies in rivers. We are making arrangements to cremate these corpses: Buxar SDO KK Upadhyay pic.twitter.com/ga34bkJccr
— ANI (@ANI) May 10, 2021
Here's All India Mahila Congress Tweet
100 dead bodies found in Ganga in Bihar's Buxar. Bodies suspected from nearby Uttar Pradesh.
This is how BJP is hiding the COVID fatalities. pic.twitter.com/CxFjtYmlkP
— All India Mahila Congress (@MahilaCongress) May 10, 2021
అప్పుడప్పుడు నదిలో మృతదేహాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయంతో కూడా చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాలను నది నీటిలో వదిలేస్తున్నారని ఆయన వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకూ 150కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయంటున్నారు.
బిహార్‌లోని బక్సర్ జిల్లా చౌసాలోని మహాదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు. మహాదేవ్ ఘాట్ వద్ద వారం రోజుల్లోనే డజన్ల కొద్దీ మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఒక్క ఆదివారమే 30కిపైగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాలను రాబందులు, కుక్కలు పీక్కుతింటున్నాయి.
చౌసాకు చెందిన బీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘మహదేవ్ ఘాట్‌కు 40 నుంచి 45 శవాల వరకు కొట్టుకువచ్చాయి. ఇవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి. కొవిడ్‌తో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉంది. దానికి ఒక కాపలా దారుడిని పెట్టి మరీ కాల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఇవి ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయి. నదిలో మృతదేహాలను అడ్డుకునే మార్గం లేనందున ఇక్కడి వరకు కొట్టుకువచ్చాయి’’ అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కొవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్తుండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నెటిజెన్లు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు యమునా నదిలోనూ భయానక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హామిర్‌పుర్, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామాల్లో మృతులు పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో పడేస్తున్నారని కొందరు చెబుతున్నారు. గుర్తుతెలియని కొన్ని మృతదేహాలను అధికారులు నదిలో వదిలేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై హామిర్‌పుర్ ఏఎస్పీ అనూప్‌కుమార్‌ను మాట్లాడుతూ.. హామిర్‌పుర్, కాన్పుర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరని.. నదిలో వదిలేస్తారని పేర్కొన్నారు. యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయని అన్నారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేవారు కూడా కొవిడ్ భయంతో నదిలో వదిలేస్తున్నారని.. దీంతో యమునలో కనిపించే మృతదేహాల సంఖ్య అధికంగా ఉంటోందని వెల్లడించారు. అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నా.. ఎటువంటి సాయం అందకపోవడంతో దిక్కు తోచని స్థితో మరికొందరు నదిలో వదిలేస్తున్నారని తెలిపారు.