Hyd, Nov 14: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు (Temperatures sees a fall) కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది. ఇక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ తోవర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి (cold waves to increase in Telugu States) పెరుగుతోంది.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండగా సాయంత్రం 5 దాటితే చాలు చలి వణికిస్తోంది. ఇక ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోనూ చలి ఎక్కువగానే ఉంది. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాగ్యనగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు మంచివి కావని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ చలికి వణికిపోతున్నారు. కొమురం భీంజిల్లాలో 11.1గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 12.2, మంచిర్యాల 13.3, నిర్మల్ 14గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదకాగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక ఏపీ లోని తిరుమలలో వర్షంతోపాటు చలితీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తులు టీటీడీ పీఏసీలు, షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దట్టమైన పొగమంచు చిరు జల్లుల మధ్యభక్తులు వణికిపోతున్నారు. మూడు రోజులుగా చిరు జల్లులతో కూడిన వర్షం పడుతూనే వుంది దీంతో పలు ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. ఇక విశాఖ మన్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ నగరంలో చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది.1970లో డిసెంబర్ 14న అత్యల్పంగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 1995, 1984, 2010 సంవత్సరాల్లో 13.7, 13.4, 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం నగరంలో చలితీవ్రత పెరిగిందని తెలుస్తోంది. రాబోయే రెండురోజులు నగరంలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా అంతా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది.మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోను చలిగాలులు కొనసాగుతున్నాయి.