New Delhi, March 22: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కోరలు చాస్తోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దెబ్బకు వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు అధికమౌతున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ తో 5 మృతి చెందారు. కాగా 2020, మార్చి 22వ తేదీ ఆదివారం నాటికి 324 మంది కరోనా (Coronavirus in India) రాకాసి బారిన పడ్డారు. భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) పాజిటివ్ వివరాలను ప్రకటించింది.
తాజాగా మహారాష్ట్రలో 5వ మరణం చోటు చేసుకుంది. 63 ఏళ్ల కోవిడ్ -19 రోగి శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడు. కాగా ఘోరమైన వైరస్ కారణంగా మహారాష్ట్రలో ఇది రెండవ మరణంగా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబైలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం, కరోనావైరస్కు పాజిటివ్ పరీక్షించిన రోగికి మధుమేహం, అధిక రక్తపోటు మరియు ఇస్కీమిక్ గుండె జబ్బులు ఉన్నాయని తెలిపారు.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
మొత్తం 16 వేల 021 మంది నుంచి 16 వేల 911 నమూనాలను సేకరించినట్లు భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) వెల్లడించింది. మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా కేసులు రికార్డవుతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో క్రమక్రమంగా కేసులు అధికమౌతున్నాయి. శనివారం నాటికి 21 కేసులకు చేరగా..ఏపీలో ఐదు కేసులు రికార్డయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్
గుజరాత్‌లో (Gujarat) 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ముఖ్యమంత్రి విజయ్ రూపాని (CM Vijay Rupani) తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాజ్‌కోట్, బరోడా, అహ్మదాబాద్, సూరత్‌లలో ఐసొలేటెడ్ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి' అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని, విద్యా సంస్థలు, జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు ఈనెల 31వ తేదీ వరకూ మూసివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక అడ్వయిజరీ జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్
మహారాష్ట్రలో కరోనావైరస్ అత్యధికంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 63 కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 కొత్త కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది విదేశాల్లో కరోనా సోకినవారు కాగా, మూడు కేసుల్లో మహారాష్ట్ర గడ్డపైనే వైరస్ సోకినట్టు గుర్తించారు. తద్వారా కరోనా ఇప్పుడు మూడో దశవైపు పయనిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా నమోదైన కరోనా బాధితులు అత్యధికం విదేశాల నుంచి వచ్చినవారే. అయితే, ఇక్కడున్న వాళ్లకు కూడా తాజాగా కరోనా సోకినట్టు వెల్లడవడంతో ఈ వైరస్ స్టేజ్-3కు చేరువలో ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఓ ప్రకటనలో వెల్లడించారు.