
Amaravati, Mar 22: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూకు (Janata Curfew In Telugu States) రంగం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం స్తంభించిపోయింది.
దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.
జనతా కర్ఫ్యూ, నేడు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్
దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ (Janata Curfew) పాటిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ముఖ్యమంత్రుల పిలుపుమేరకు ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛంధంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా తెలంగాణలో ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎంలు సూచించారు. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు. కాగా తెలంగాణాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర బార్డర్ కూడా మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్‌పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు.