Amaravati, Mar 21: ఆదివారం దేశమంతా జనతా కర్ప్యూ (Janata Curfew) పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీలో (AP) కూడా జనతా కర్ప్యూకి సంఘీభావం ప్రకటించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ (CM YS Jagan) పిలుపునిచ్చారు. మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సీఎం కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తుండడం పట్ల ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపునకు స్పందిద్దాం.. కరోనా వైరస్(COVID-19)ను జయిద్దాం’’ అని డీజీపీ గౌతం సవాంగ్ (DGP Gautam Sawang) పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని, జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్ ను జయించాలని పిలుపునిచ్చారు.
ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసులు అప్రమత్తతో ఉంటారని... కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎందుకీ జనతా కర్ఫ్యూ?
కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు. తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం. కావున జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదాం.