COVID-19 in AP: ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, 5కు చేరిన మొత్తం కరోనా కేసులు, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే
Coronavirus Outbreak in Andhra Pradesh | PTI Photo

Amaravati, Mar 22: ఏపీలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లండన్‌ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చాడు. మరో వ్యక్తి ఫ్రాన్స్‌ నుంచి ఈ నెల 17వ తేదీన విజయవాడకు వచ్చాడు. వీళ్లిద్దరికీ కరోనా (CoronaVirus) పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు అధికారులు గుర్తించారు. వీరిని బోధనాసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.

వీరిద్దరూ ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో తిరిగారు.. అన్నది ఆరా తీస్తున్నారు. వారి బంధువులను సైతం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువస్తున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే. కాగా కృష్ణా జిల్లాలో 787 మంది గృహ నిర్భందంలో ఉన్నారు. వీరిని వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుంది. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్ పంపించేందుకు బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లాలో 17 ఆసుపత్రుల్లో 81 బెడ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పని చేస్తున్నాయి. 24 గంటలు పని చేసేలా రెండు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

రాష్ట్రంలో ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 12 వేల మందికి పైగా ప్రయాణికులను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. వీళ్లందరిపైనా ప్రత్యేక నిఘాతో 89 శాతం మందిని ఇంట్లోనే ఉంచి వైద్య పర్యవేక్షణ చేయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పటిష్ట చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరించకుండా సమగ్రంగా కట్టడి చేస్తోంది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సీఎం వైఎస్‌ జగన్‌ రూపకల్పన చేసిన వలంటీర్ల వ్యవస్థ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతుండగా.. భారత్‌లో (CoronaVirus in India) పాజిటివ్ కేసుల సంఖ్య 315కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.