New Delhi, April 7: భారతదేశంలో కరోనావైరస్ కేసుల (COVID-19 in India) సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 4,421 కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) అధికారికంగా వెల్లడించింది. గత 24 గంటల్లో మొత్తం 354 కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు తెలిపింది. ఇదే సమయంలో 5 మరణాలు కూడా నమోదై, దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 114 కి చేరుకుందని గణాంకాలు విడుదల చేశారు.
ఇక వైరస్ చేత అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (Maharashtra) మొదటి స్థానంలో ఉంది, ఇక్కడ కరోనావైరస్ కేసుల సంఖ్య 900 మార్కుకు చేరుకుంది. గత నెలలో నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిఘి జమాత్ ఈవెంట్ ద్వారా తమిళనాడు రాష్ట్రంలో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 633 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత దిల్లీలో కోవిడ్-19 కేసులు 549కి చేరుకున్నాయి.
మరోవైపు భారతదేశంలోనే మొట్టమొదటి కరోనావైరస్ కేసులను నమోదు చేసి, గత వారం వరకు కూడా మహారాష్ట్రతో సరి సమానంగా నిలిచిన కేరళ రాష్ట్రం ఇప్పుడు పరిస్థితులను కొంతవరకు మెరుగుపరుచుకుంది. ఇక్కడ కొత్తగా వచ్చే COVID-19 కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పటివరకు కేరళలో 387 కేసులు నమోదయ్యాయి. అటు తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో కేసుల సంఖ్య 300 దాటాయి.
100 కంటే తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, హర్యానా, అస్సాం, బీహార్ మరియు ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఇక మణిపూర్, త్రిపుర, మిజోరం, పుదుచ్చేరి, గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 కంటే తక్కువే ఉన్నాయి.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. ఈ లాక్డౌన్ మరింత కాలం పొడిగించే ఆలోచన లేదని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి గత వారమే ప్రకటించారు.. అయితే వివిధ రాష్ట్రాల నుంచి లాక్డౌన్ పొడగించే ప్రతిపాదనలు కేంద్రానికి వస్తున్నాయి.
ఏప్రిల్ 15 నుండి రాష్ట్రంలో లాక్డౌన్ సడలించకపోవచ్చని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి సోమవారం చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేయడం పట్ల అస్సాం హోంమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా విముఖత వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఆంక్షలను సడలిండం సాధ్యం కాకపోవచ్చునని తెలిపారు.
ఇక కోవిడ్ -19కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దేశం వద్ద ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌనే అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) సూటిగా చెప్పారు. బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు, చచ్చిపోతే ఆ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం- సీఎం కేసీఆర్
"ఎలాంటి సంకోచం లేకుండా లాక్డౌన్ మరింత కాలం పొడగించాలని నేను ప్రధానమంత్రిని మరియు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలన్నా, యూఎస్, స్పెయిన్ మరియు ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి రాకుండా నివారించాలన్నా లాక్డౌన్ మాత్రమే ఆయుధం" అని కేసీఆర్ తన పత్రికా సమావేశంలో స్పష్టం చేశారు.