Narendra Modi & coronavirus (Photo Credits: IANS)

New Delhi, March 5: ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ (Coronavirus Outbreak) ఇప్పటికే విస్తరించింది. పలు దేశాలకు ఈ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో (India-European Union Summit) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్‌ పర్యటన (Brussels Visit) రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు.

హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు

రెండు దేశాల ఆరోగ్య శాఖ అధికారుల సలహాల మేరకు భారత్-ఈయూ ఇద్దరూ పర్యటన వాయిదాకు అంగీకారం తెలిపారని,సమ్మిట్ ను తదుపరికి వాయిదా వేయడం తెలివైన పని అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది మార్చి 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో ఇండియా-ఈయూ సదస్సు జరగాల్సి ఉంది.

బ్రసెల్స్‌లో బుధవారం పది కరోనా వైరస్‌ కేసులు కొత్తగా వెలుగుచూడటంతో బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఈయూ, భారత్‌ల మధ్య సన్నిహిత సహకార బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నామని రవీష్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్

కాగా మోదీ బెల్జియం పర్యటనకు సంబంధించి.. గత నెలలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌.. అక్కడ పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ఇండియాలో ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా కరోనా వైరస్‌ వ్యాధితో చనిపోయారు. 90 వేల మందికి పైగా కరోనా సోకింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హోళీ పండుగకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్న విషయం విదితమే.