Covid in India: షాక్..బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా, దేశంలో 24 గంటల్లో 28,903 కేసులు, 188 మంది కోవిడ్ కారణంగా మృతి, కరోనా కల్లోలం నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోదీ వర్చువల్ సమావేశం
Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, Mar 17: దేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,45,284 మంది కోలుకున్నారు. 2,34,406 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,50,64,536 మందికి వ్యాక్సిన్లు (Covid Vaccination) వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,92,49,784 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,69,021 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్‌ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని వారం రోజుల క్రితమే దవాఖానకు తీసుకువచ్చారని, ప్రత్యేకంగా ఒక గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తున్నది. వారం తర్వాత అతనికి కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. అయితే బాధితుడిలో తొలుత కరోనా లక్షణాలేవీ కనిపించలేదని తెలిసింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు తెలియాల్సివుంది.

ఇక మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ (Maharashtra Covid Second Wave) ప్రారంభ దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించకపోతే మరోసారి లాక్ డౌన్ తప్పదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఉరేసుకుని చనిపోయిన బీజేపీ ఎంపీ, ఢిల్లీలో కలకలం రేపుతున్న ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద మరణం, కరోనాతో కన్నుమూసిన మరో బీజేపీ కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ గాంధీ

మళ్లీ కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్న నేపథ్యంలో, మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రుల నుంచి సలహాలు స్వీకరిస్తూనే, రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనున్నారు. దీంతోపాటు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా చర్చించనున్నారు.

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 261 మందికి కరోనా పాజిటివ్ (AP Coronavirus) నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు నమోదు కాగా... విశాఖపట్టణం జిల్లాలో 39 కేసులు, చిత్తూరు జిల్లాలో 37 కేసులు, కృష్ణా జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు గత 24 గంటల్లో ఒక్క కరోనా మృతి కూడా సంభవించకపోవడం గమనార్హం. గత 24 గంటల్లో 125 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,92,269కి చేరుకుంది. మొత్తం 8,83,505 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌ కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో బౌద్ధ ఆశ్రమంలో 20 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 154 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వ తేదీన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు.

కరోనా వచ్చిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది. కానీ ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనని తాండ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్‌ వివరించారు. ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధ ఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు.