New Delhi, DEC 24: ప్రతియేటా వేతన జీవులు ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (ITR) సబ్మిట్ చేస్తుంటారు. అయితే, ఒక్కోసారి ఐటీఆర్‌ల్లో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ పొరపాట్లను చక్కదిద్దుకునేందుకు ‘ఆదాయం పన్ను చట్టం-1961’లో వేతన జీవులకు వెసులుబాటు ఉంది. దీన్నే రివైజ్డ్ ఐటీఆర్ అని పిలుస్తుంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఐటీఆర్‌లో ఏమైనా పొరపాట్లు జరిగినా సరి చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పిస్తున్నది ఆదాయం పన్నుశాఖ. గత పొరపాట్లు సరిదిద్దుకోవడానికి వేతన జీవులు.. పన్ను చెల్లింపుదారులకు చాన్స్ ఇవ్వడమే రివైజ్డ్ ఐటీఆర్ (Revised ITR) లక్ష్యం. ముందుగా సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లో ఒక్కోసారి ఏదైనా ఆదాయ వివరాలు నమోదు చేయడం మరిచిపోవచ్చు. దాన్ని రివైజ్డ్ ఐటీఆర్‌లో రికార్డు చేయొచ్చు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ మీద ఐటీ మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. గతంలో చేసిన డొనేషన్లు మర్చిపోయినా వాటినీ ప్రస్తావించి బెనిఫిట్ పొందొచ్చు. వ్యక్తిగత సమాచారం తప్పులు కూడా సరిచేసుకోవచ్చు.
జూలై నెలాఖరులోగా సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లో ఆదాయ వివరాల్లో హెచ్చు తగ్గులు నమోదైనా రివైజ్డ్ ఐటీఆర్‌లో ఫైల్ చేయొచ్చు. ఆదాయం పెరిగితే మాత్రం అదనపు పన్ను, ఆ పన్నుపై వడ్డీ చెల్లించాలి. ఇన్ కం టాక్స్ పరిధిలోకి వచ్చేవారు తమ ఒర్జినల్ ఐటీఆర్‌లో తప్పులు దొర్లినప్పుడు రివైజ్డ్ ఐటీఆర్ సబ్మిట్ చేయొచ్చు. గడువు ముగిశాక ‘బీ లేటెడ్ రిటర్న్స్’ సబ్మిట్ చేసినా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి.. ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల ముందు వరకు మాత్రమే అనుమతి ఉంది. అంటే ఈ నెలాఖరు వరకు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్ సబ్మిట్ చేసేందుకు వీలు ఉంది. బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పేరులో సవరణ వంటి చిన్న మార్పులకు ఎటువంటి చర్యలు తీసుకోరు. అదనపు ఆదాయం పేర్కొంటే మాత్రం ఆదాయం పన్ను విభాగం అధికారులు తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఉంటే దానిపై పన్ను.. పన్నుపై వడ్డీ పే చేయాలి.
ఎన్నిసార్లు రివైజ్డ్ ఐటీఆర్‌లు చేయాలన్న విషయమై చట్టంలో పరిమితి లేదు. కానీ తరుచుగా మార్పులు చేర్పులు చేస్తే మాత్రం ఐటీ, ఇతర దర్యాప్తు సంస్థల తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐటీఆర్ ఫామ్ మార్చుకోవడానికి, రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి చాన్స్ ఉంది. రివైజ్డ్ ఐటీఆర్ సబ్మిట్ చేస్తున్నట్లయితే.. అంతకుముందు దాఖలు చేసిన ఒర్జినల్ ఐటీఆర్‌ను పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నట్లు.. కనుక రివైజ్డ్ ఐటీఆర్‌నే తుది రిటర్న్స్‌గా కేంద్ర ఆర్దిక శాఖ, ఆదాయం పన్నుశాఖ పరిగణిస్తాయని సమాచారం.