ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఒక తీర్పు వైవాహిక సంబంధాలపై కీలక చర్చకు దారితీసింది. వృద్ధ అత్తమామల పట్ల భార్య చూపిన కఠినత్వం, నిర్లక్ష్యం కూడా వైవాహిక చట్టం ప్రకారం "క్రూరత్వం" కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం, భర్త అత్తమామల పట్ల భార్య ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైతే, ఆయన విడాకులకు అర్హుడు అవుతారు.
ఈ కేసును జస్టిస్‌లు అనిల్ క్షేత్రర్‌పాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్ లతో కూడిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. వారు పేర్కొన్నదేమిటంటే భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, పెద్దలు అనేవారు కుటుంబానికి అంతర్భాగం. అందువల్ల జీవిత భాగస్వామి వారిపట్ల గౌరవం, ఆప్యాయత చూపించడం కర్తవ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేయడం లేదా వృద్ధ తల్లిదండ్రుల పట్ల నిర్దయ ప్రవర్తన చూపడం, వివాహ బంధంలో మానసిక క్రూరత్వానికి కారణం అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో కుటుంబ కోర్టు భర్తకు.. భార్య క్రూరత్వం కారణంగా విడాకులు మంజూరు చేసింది. ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ భార్య హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అయితే, హైకోర్టు ఆ అప్పీల్‌ను పరిశీలించి, కుటుంబ కోర్టు తీర్పును సమర్థిస్తూ భార్య పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్భంగా, భార్యకు తన అత్తగారు నడవలేకపోతున్నారని, ఆమె తుంటి మార్పిడి (hip replacement) శస్త్రచికిత్స చేయించుకున్నారని కూడా తెలియదని కోర్టు పేర్కొంది.
ఇది భార్య కుటుంబ సభ్యుల పట్ల పూర్తి ఉదాసీనతను సూచిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.భార్య, భర్త ఇద్దరూ పరస్పర గౌరవం, కుటుంబ పెద్దల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం లేదా వారిని పక్కన పెట్టడం కేవలం కుటుంబ విలువలను మాత్రమే కాదు, వివాహ బంధాన్నే దెబ్బతీస్తుందని కోర్టు తెలిపింది.