Delhi, May 20: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు (Disha Encounter Case) చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. 2019 డిసెంబర్‌లో హైదరాబాద్ సమీపంలో జరిగిన నలుగురి ఎన్‌కౌంటర్‌పై (Disha Accused Encounter Case) ఇవాళ సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఇవాళ కమిషన్ రిపోర్ట్‌ను అందుకున్నది. అయితే ఆ నివేదిక సీల్డ్ కవర్‌లోనే ఉండాలని చేసిన తెలంగాణ ప్రభుత్వ సూచనను కోర్టు తిరస్కరించింది. కేసుతో లింకు ఉన్న అన్ని పార్టీలకు ఆ రిపోర్ట్‌ను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అన్ని రికార్డులను తెలంగాణ హైకోర్టుకు పంపాలని, ఆ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీం చెప్పింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దోషులెవరు అనేది కమిషన్ గుర్తించింది. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఈ సందర్భంగా కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని (Transferred From Supreme Court To Telangana HC) చెప్పారు. నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు.
సీనియర్లతో కూడిన కమిటీకి నివేదిక అందజేయాలని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే నివేదికను బహిర్గతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. నివేదిక బయటకు వస్తే సమాజంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని అత్యున‍్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణలో భాగంగా వీసీ సజ్జనార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. అలాగే.. నివేదిక కాపీలను ఇరు పక్షాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
26 ఏళ్ల వెటర్నరీ లేడీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ కేసులో విచారణ చేపట్టేందుకు అప్పటి సీజేఐ ఎస్ఏ బోబ్డే ఓ ఎంక్వైరీ ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ప్యానల్ ఆ ఎన్‌కౌంటర్‌పై రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆ బృందంలో బాంబే హైకోర్టు జస్టిస్ రేఖా బాల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ ఉన్నారు. రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు. కానీ ఆ అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. దీంట్లో రహస్యం ఏమీ లేదని, కొందరు దోషులుగా తేలారని, ఇక ఆ రాష్ట్రమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీజేఐ రమణ తెలిపారు.
రేప్ కేసు నిందితులను చంపాలన్న ఉద్దేశంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు కమిటీ తన రిపోర్ట్‌లో తెలిపింది. నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, హైదరాబాద్ పోలీసుల పనితీరుపై కూడా రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఈ కేసు విచారణలో చాలా లోపాలు ఉన్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ కేసుతో లింకు ఉన్న పది మంది పోలీసుల్ని విచారించాలని కమిటీ అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జోలు శివ, జోలు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మైనర్లు అని రిపోర్ట్ పేర్కొన్నది.
10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలిని కమిషన్ తెలిపింది.