Hyd, July 5: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు (Weather Forecast) కురుస్తున్నాయి. కొన్ని ప్రంతాల్లో భారీవర్షాలు వరదలకు కారణమవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఈ ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వంపు తిరిగి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని అనేక చోట్ల మోస్తరు వర్షాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, యానాంలలో పలుచోట్ల రాగల 48 గంటల్లో భారీ వర్షాలు (Heavy rain forecast) కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మంగళవారం రాత్రి గోదావరి జిల్లాల్లో కుండపోతగా వాన కురిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కాకినాడలో దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. రాజమండ్రి, తాడేపల్లిగూడెంలో భారీ వర్షం పడింది. కోనసీమ, తుని, తణుకు, మచిలిపట్నం, విజయవాడ, కైకలూరు, గుంటూరు లోనూ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి విశాఖపట్నంలోనూ భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
గత 24 గంటల్లో ఏపీకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, ప్రకాశం జిల్లా రాచర్లలో అత్యధికంగా 9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగమహేశ్వరం, విజయనగరం జిల్లా కొమరాడలో 7 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కళింగపట్నం, విజయనగరం జిల్లా కురుపాం, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఐదు సెంటిమీటర్ల వర్షం కురిసింది. అల్పపీడనం ప్రస్తుతం మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్. నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నిజామాబాద్ జిల్లా మండోరాలో 108 మిలిమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 104, సంగారెడ్డి జిల్లా కంగ్లిలో 102, నాగర్ కర్నూల్ జిల్లా తోటపల్లిలో 96 మిల్లిమీటర్ల వర్షపాతం రికార్జైంది. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మళ్లీ బాదుడు షురూ, రూ.50 పెరిగిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర, పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి..
తాజాగా, వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. కొమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ (IMD issues yellow, orange alerts) చేసింది.
హైదరాబాద్ జంట నగరాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షం దంచికొట్టడంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, ఆబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ, బషీర్‌బాగ్, హిమానత్‌నగర్ ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది. రహదారులపై వర్షం నీరు పొంగిపొర్లడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఈ నెల 7వ తేది వరకు భారీవర్షాలు కురిసే అశకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఉష్ణచలనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జూన్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 79.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కన్నా 56 శాతం అదనం. పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా నీలగిరి, కోవై, తిరుప్పూర్, తేని, దిండుగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కన్నియాకుమారి సముద్రతీర ప్రాంతం, మన్నార్ వలైకుడ, తమిళనాడు, ఆంధ్ర సముద్రతీర ప్రాంతాలు, నైరుతి, మధ్య పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈదురుగాలులు గంటకు 50 కి.మీ వేగంతో వీస్తాయని, ఈ ప్రాంతాల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరువానలు మొదలయ్యాయి. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. IMD ముందుగా మంగళవారం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని హెచ్చరించింది.